అమరావతి : వైఎస్ఆర్ రైతు భరోసా పథంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..దేశంలోనే రైతు భరోసా ఆదర్శవంతమైన పథకంగా నిలుస్తుందన్నారు. ఆఖరి నాలుగు నెలల్లో చంద్రబాబు పథకాలు ఇస్తే…ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నాలుగు నెలల్లోనే పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. అప్పట్లో చంద్రబాబు ఎన్నికల ఎత్తుగడ కోసమే రుణమాఫీ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. అప్పుడు సొంత పొలం ఉన్నవారికి రుణమాఫీ ఇస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి స్పష్టత ఇచ్చారు.

రాష్ర్టంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంలో వైసీపీ విఫలమైందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. జగన్ మాటిచ్చి మడమ తిప్పాడని బాబు ఆరోపించారు. రైతు భరోసా పథకంలో రైతుకు ఇస్తామని చెప్పిన దానికన్నా ఎక్కువే ఇచ్చామని వైసీపీ నేత బుగ్గన చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో రైతు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడని, వైసీపీ వచ్చాక ప్రతి రైతు ఆనందంగా బతుకుతున్నాడన్నారు. 40 ఏళ్ల అనుభవంతో బాబు ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని చంద్రబాబు నాయుడు అప్పులపాలు చేశారని బుగ్గన యద్దేవా చేశారు. కుక్కతోక వంకర అన్నట్లు టీడీపీ తీరు ఉందని సీఎం జగన్ విమర్శిస్తే..ఆ కుక్క తోక పట్టుకునే ప్రభుత్వం గోదారి ఈదుతుందని చంద్రబాబు విమర్శలను తిప్పికొట్టారు. బుగ్గన అందరి చెవుల్లో పువ్వులు పెట్టాలని చూస్తున్నారన్నారు. నా వయసు ఎంతైనా నేను పాతికేళ్ల కుర్రాడిలా ఆలోచిస్తానన్నారు. మీ మైండ్ గేమ్స్ నా దగ్గర చెల్లవని బాబు వార్నింగ్ ఇచ్చారు. మీ 150 మంది ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పేందుకు నేను ఒక్కడినే చాలు అని చంద్రబాబు గర్వంగా చెప్పారు.

వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు పాతికేళ్ల కుర్రాడిలా ఆలోచిస్తూ ఆయన కుమారుడైన లోకేష్ ప్రవర్తన 70 ఏళ్ల వాడిలా ఉందని విమర్శించారు. చంద్రబాబులో ఏదో తేడా కనిపిస్తోందని, ఆయన అధికార పక్ష నేతలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు లేరని దుయ్యబట్టారు. ఐదేళ్ల పాలన పూర్తయ్యే నాటికి జాబు రావాలంటే బాబు పోవాలన్నట్లు రాష్ర్టం తయారయిందని, ఇదే ఆయన పాలనా తీరుకు నిదర్శనమన్నారు. వైసీపీ అధికారం చేపట్టాక మొత్తం 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని అంబటి చెప్పుకొచ్చారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. గురువారం పంటల ధరలను ప్రకటిస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ అంటే రైతు పక్షపాతి అని రుజువు చేసుకుంటామని, ధరల స్థిరీకరణకు రూ.3వేల కోట్లను కేటాయిస్తామన్నారు. రైతన్నలకోసం నాలుగడుగులు ముందుకు వేస్తాం గానీ మోసం చేసే ప్రభుత్వం మాది కాదని జగన్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తదుపరి ఏపీ అసెంబ్లీ సమావేశాన్ని స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.