నామినేషన్ల దాఖలు గడువు పెంచండి
By Newsmeter.Network Published on 12 March 2020 11:12 AM ISTఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు పెంచాలంటూ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 76చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఘటనలు చోటు చేసుకున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన ఆధారాలను తన ఫిర్యాదు లేఖకు జోడించి ఎన్నికల సంఘానికి పంపించారు.
పులివెందుల, పుంగనూరు, మాచర్ల, మంత్రాలయం, తెల్లాకూరు, పుల్లంపేట, కావేటినగర్ తదితర స్థానాల్లో మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని బాబు కోరారు. రిటర్నింగ్ అధికారులు అందుబాటులో లేని కారణంగా సకాలంలో అందజేయలేక పోయామనే కారణాలు చెప్పారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు వేయకుండా అధికార వైకాపా నాయకులు అడ్డంకులు సృష్టించారని, పలు చోట్ల ఓ వర్గం పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు సహకరించారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
కుల ధృవీకరణ, నోడ్యూ సర్టిఫికెట్లు లేకపోయినా నామినేషన్లను ఆమోదించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం చేసే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.