టాలీవుడ్‌లో కాకరేపుతోన్న 'ఐటీ రైడ్స్'...!

By Medi Samrat  Published on  20 Nov 2019 3:09 PM IST
టాలీవుడ్‌లో కాకరేపుతోన్న ఐటీ రైడ్స్...!

ముఖ్యాంశాలు

  • క‌ల‌క‌లం రేపుతున్న ఐటీ దాడులు
  • ఏక‌కాలంలో 25 లొకేష‌న్ల‌లో సోదాలు
  • కీల‌క ప‌త్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం

ఈ రోజు ఉద‌యం టాలీవుడ్ సంచ‌ల‌న వార్త‌తో మేల్కొంది. తెలుగు సినీ ప్రముఖులకు చెందిన‌ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల దాడులతో క‌ళ్లు తెరిచింది. ఏక‌కాలంలో.. ప‌లు న‌గ‌రాల్లో నిర్మాతలు, అగ్ర హీరోల ఇళ్లు, వారి బంధువుల ఇళ్లు, కార్యాల‌యాలలో ఐటీ శాఖ‌ అధికారులు దాడులతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది.

వివ‌రాళ్లోకెళితే.. ప్ర‌ముఖ‌ నిర్మాత, సురేష్ ప్రొడ‌క్ష‌న్ అధినేత‌ దగ్గుబాటి సురేశ్‌బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టూడియోలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా అత‌ని త‌మ్ముడు ‘విక్టరీ’ వెంకటేశ్ ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. పుప్పాలగూడ లోని డాలర్ హిల్స్‌లో ఉన్న వెంకటేశ్‌ నివాసంలో ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

అంతేకాకుండా.. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇంట్లో కూడా ఐటీ శాఖ‌ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని నాని ఇల్లు, కార్యాలయంలో ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లైన సురేష్ బాబుకు చెందిన‌ సురేష్ ప్రొడ‌క్ష‌న్.. సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌కు చెందిన‌ హారిక.. హాసిని క్రియేష‌న్స్, సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ లే టార్గెట్ గా ఈ దాడులు జ‌రుగుతున్నాయి. అంతేకాకుండా కొత్తగా సినిమాలు నిర్మించిన ప్రొడక్షన్‌ ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇక‌పోతే.. నిర్మాణ సంస్థ‌లపై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం మాములు విష‌య‌మే. కానీ హీరో నానీ ఇళ్ల‌పై, కార్యాల‌యాల‌పై దాడులు జ‌ర‌గ‌డంతో ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. దీనిలో పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన విష‌య‌మేమి లేదంటున్నారు టాలీవుడ్ వ‌ర్గాలు. నానీ కూడా నిర్మాత‌గా మారి 'ఆ' వంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా దాడులు జ‌రుగుతున్న సంస్థ‌లకు సంబంధించి గ‌తంలో నిర్మించిన‌ ప‌లు సినిమాల‌లో నాని నిర్మాణ భాగ‌స్వామ్యుడిగా కూడా వ్య‌వ‌హ‌రించాడ‌ట‌. అందుకే నానికి చెందిన ఇళ్లు, కార్యాల‌యాల‌లో కూడా ఈ దాడులు జ‌రుగుతున్నాయి.

అయితే.. గ‌తంలో ఈ నిర్మాణ‌ సంస్థ‌లు నిర్మించిన‌ సినిమాలకు సంబంధించిన నిర్మాణ వ్యయాలు, ఆదాయాల లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. హైద‌రాబాద్, ముంబాయి, వైజాగ్, చెన్నై ఇలా ఈ సంస్థ‌ల‌కు సంబంధించి 25 లొకేష‌న్ల‌లో బృందాలుగా ఏర్ప‌డి ఏక‌కాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల‌లో సంస్థ‌ల‌కు సంబంధించి కీల‌క‌మైన‌ ఐటీ రిటర్న్‌ పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుంటే.. ఐటీ సోదాలపై మీడియా హడావుడి చేయాల్సిన అవసరం లేదని.. ఇవన్ని సాధారణంగా సంవ‌త్స‌రానికి ఒక‌సారి జరిగే మాములు తనిఖీలేనని టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా ఈ దాడులు సాధార‌ణమో లేక అక్ర‌మ ఆస్తుల వివ‌రాలు బ‌య‌ట‌పెట్ట‌డానికో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

కాగా.. సినిమా నిర్మాణ‌ సంస్థ‌ల‌పై, హీరోల‌పై ఈ త‌ర‌హా దాడులు ఇదే ప్ర‌థ‌మం కాదు. గ‌తంలో కూడా కోలీవుడ్, బాలీవుడ్ ల‌కు సంబంధించి అగ్ర‌హీరోలు, నిర్మాత‌లు, హీరోయిన్ల ఇళ్లు, కార్యాల‌యాల‌పై కూడా దాడులు జ‌రిగాయి. ఎంత‌వ‌ర‌కూ అక్ర‌మ ఆస్తులు బ‌య‌ట‌ప‌డ్డాయో తెలియ‌దు కానీ.. రంగుల ప్ర‌పంచానికి సంబంధించిన వారి వార్త‌లు కావ‌డంతో సామాజిక మాధ్య‌మాల్లో కొద్దిరోజులు హ‌ల్‌చ‌ల్ చేస్తాయి.

Next Story