18 కోట్ల పాన్ కార్డులపై వేటు పడనుందా..?
By సుభాష్ Published on 21 Aug 2020 8:27 AM GMTదేశ వ్యాప్తంగా 18 కోట్ల పాన్‌కార్డులపై వేడు పడనున్నట్లు తెలుస్తోంది. పాన్ కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేయని పాన్‌కార్డులను గుర్తించి నిర్వీర్యం చేస్తామని ఐటీశాఖ స్పష్టం చేసింది. గడువు ముగిసేలోగా పాన్‌కార్డును ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని ఆ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తంలో లావాదేవీలను జరిపే వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కొంత మంది పన్నులను ఎగవేసేందుకు..
కాగా, కొంత మంది పన్నులను ఎగవేసేందుకు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను ఉపయోగిస్తున్నారని ఐటీ అధికారులు వెల్లడించారు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేస్తే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందే అవకాశం ఉండదని, అందుకే ఎక్కువ మంది లింక్ చేసుకోవడం లేదని పేర్కొన్నారు. కాగా, దేశంలో 130 కోట్ల మంది జనాభాలో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని ఇటీవల ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
పన్ను చెల్లింపు కోసం సులభ విధానం
ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల సౌకర్యం కోసం పారదర్శక పన్ను విధానం, నిజాయితీపరుల కోసం గౌరవం అన్న పోర్టల్‌ను ఐటీ శాఖ ప్రారంభించింది. దీని వల్ల పన్ను చెల్లించేందుకు ప్రజలు కార్యాలయాలు, అధికారుల చుట్టు తిరిగే అవసరం ఉండదని మోదీని తెలిపారు.