అత్యాచారం చేస్తే.. అదే తగిన శిక్ష..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sep 2020 1:23 PM GMT
అత్యాచారం చేస్తే.. అదే తగిన శిక్ష..!

ఎన్ని కఠిన చట్టలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. పాకిస్థాన్ లో మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. ఇటీవల రోడ్డు మీద కనిపించిన మహిళను ఎత్తికెళ్లి అత్యాచారం చేసిన ఘటన ఆ దేశాన్ని ఊపేస్తోంది. కాగా.. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరితీయడమో లేదా పురుషత్వం కోల్పోయేలా (క్యాస్ట్రేషన్) చేయాలన్నారు.

లాహోర్ కు చెందిన ఓ మహిళ కారులో తన ఇద్దరు పిల్లలతో కలిసి వెలుతుండగా.. పెట్రోల్ అయిపోయింది. దీంతో సాయం కోసం ఆమె ఎదురుచూస్తుండగా.. అటుగా వెలుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరికి వచ్చారు. కారు అద్దాలను ధ్వంసం చేసి తుపాకులతో బెదిరించి వారిని బయటకు లాగారు. ఇద్దరు చిన్నారుల ముందే మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు సరిగా స్పందించలేదు. అంతేకాకుండా మగవారి సాయం లేకుండా రాత్రి సమయంలో బయటకు వెళ్లడం తప్పని.. ఆమహిళనే తప్పు పట్టారు అక్కడి పోలీసులు. ఈ ఘటనపై పాకిస్తాన్ అంతటా నిరసనలు రేకెత్తుతుండగా.. వందలాది మంది మహిళలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్ల మీదికి వచ్చారు.

ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటనపై స్పందించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కెమికల్ కాస్ట్రేషన్ ప్రయోగించాలని ఇమ్రాన్ ఆదేశించారు. ఇప్పటికే చాలా దేశాలలో ఇది అమలు చేయబడుతుందని చెప్పిన ఇమ్రాన్ హత్యలకు ఏవిధంగానైతే గ్రేడింగ్ ఉంటుందో అలాగే అత్యాచారాలకు కూడా గ్రేడింగ్ చేసి లైంగిక నేరాలకు పాల్పడిన వారికి ఫస్ట్ డిగ్రీ అమలుచేయాలని సూచించారు. ఆ ఫస్ట్ డిగ్రీలో కెమికల్ కాస్ట్రేషన్ ను చేర్చి అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కెమికల్ కాస్ట్రేషన్ ద్వారా మగతనాన్ని తగ్గించి మళ్లీ జీవితంలో లైంగిక కార్యాకలాపాలకు పనిరాకుండా చేయాలని ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులుగా బావిస్తున్న ఇద్దరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ ప్రావిన్స్ సీఎం ఉస్మాన్ బజ్దార్ ట్విట్టర్లో వెల్లడించారు.

Next Story