హిల్లరీ క్లింటన్ అల్-ఖైదా తీవ్రవాద సంస్థ నేత ఒసామా బిన్ లాడెన్ తో చేతులు కలిపిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓటు వేసే ముందు ఎవరితో చేతులు కలిపారో ఓసారో ఆలోచించండి అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. అమెరికా ఎలెక్షన్స్ నేపథ్యంలోనే ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో కూడా ఇదే ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ:
హిల్లరీ క్లింటన్ ఒసామా బిన్ లాడెన్ తో చేతులు కలిపిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారు.
ఇందుకు సంబంధించిన ఒరిజినల్ ఫోటో Freaking News లో పోస్టు చేయడం జరిగింది. 2007 లో నిర్వహించిన ఫోటో షాప్ కాంటెస్ట్ లో భాగంగా ఈ ఫోటోను తయారు చేశారు.
ఒరిజినల్ ఫోటోలో ఉన్నది భారత సంగీతకారుడు శుభాశీష్ ముఖర్జీ.. వాషింగ్టన్ సెంటర్ లో 2004 సంవత్సరంలో నిర్వహించిన 'ఆసియా సొసైటీ' కార్యక్రమంలో హిల్లరీ క్లింటన్ ను ఆయన కలిశారు. ఆ ఫోటోను ఫోటో షాప్ చేయడం జరిగింది.
2007 లో నిర్వహించిన ఫోటో షాప్ పోటీలలో భాగంగా దీన్ని ఫోటోషాప్ చేయడం జరిగింది. అందులో భాగంగా 23 ఎంట్రీలు వచ్చాయి.. ఒక ఫోటోలో ఒసామా బిన్ లాడెన్ తో హిల్లరీ ఉన్న ఫోటోగా మార్చి తీసుకుని వచ్చారు. శుభాశీష్ ముఖర్జీ ముఖం ఉన్న చోట బిన్ లాడెన్ ముఖాన్ని ఉంచారు. దానికి ట్యాగ్ లైన్ గా “Going for the terrorist vote” అంటూ చేర్చారు. అంతేకానీ హిల్లరీ ఏ కార్యక్రమంలోనూ ఒసామాను కలవలేదు.
ఈ ఫోటో గత కొన్నేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది. చాలా మంది ఈ ఫోటోను నిజమేనని నమ్ముతూ ఉన్నారు కూడానూ..! ఎన్నో మీడియా సంస్థలు ఈ ఫోటో నిజం కాదని కొన్ని సంవత్సరాలుగా తేల్చి చెబుతూనే ఉన్నాయి. BBC, SNOPES సంస్థలు కూడా దీనిపై ఎప్పటికప్పుడు నిజ నిర్ధారణ చేస్తూ వివరణ ఇస్తూనే ఉన్నాయి.
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఫోటోషాప్ పోటీలలో భాగంగా ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారు.