'నేను నీ కెప్టెన్నీ.. న‌న్ను పిచ్చివాడిని చేయొద్దు'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2020 2:02 PM GMT
నేను నీ కెప్టెన్నీ.. న‌న్ను పిచ్చివాడిని చేయొద్దు

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఎంత ప్ర‌శాంతంగా ఉంటాడో అంద‌రికి తెలుసు. అందుకే అభిమానులంతా మ‌హేంద్రుడుని ముద్దుగా కెప్టెన్ కూల్ అని పిలుచుకుంటారు. కాగా.. ధోని కోప్ప‌డిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. తాజాగా మ‌హీ త‌న‌పై అరిచిన విష‌యాన్ని వెల్ల‌డించాడు టీమ్ఇండియా పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ.

క‌రోనా కార‌ణంగా క్రికెట‌ర్లు అంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. తాజాగా బెంగాల్ క్రికెట‌ర్ మ‌నోజ్ తివారితో క‌లిసి ష‌మీ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. 2014లో టీమ్ఇండియా న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌కు వెళ్లింది. వెల్లింగ్ట‌న్ వేదిక‌గా కివీస్ తో ఓ టెస్టు మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆట‌గాడు బ్రెండ‌న్ మెక్‌క‌ల‌మ్ త్రిశ‌త‌కం బాదేశాడు. అయితే.. ఆ మ్యాచ్‌లో మెక్‌క‌ల‌మ్ 14 ప‌రుగుల వ‌ద్దే ఔట్ కావాల్సింది ఉంది. ష‌మీ బౌలింగ్‌లో అత‌డు ఇచ్చిన క్యాచ్ విరాట్ కోహ్లీ వ‌దిలేశాడు. దీంతో అత‌డు రెచ్చిపోయి ఆడాడు. ఆ రోజు మొత్తం బ్యాటింగ్ చేయ‌డంతో పాటు మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఆడి త్రిశ‌త‌కం సాధించి కివీస్ ను ఓట‌మి నుంచి ర‌క్షించాడు.

'కోహ్లీ క్యాచ్ వ‌దిలేసిన‌ప్పుడు పెద్ద‌గా ఏం బాద‌ప‌డ‌లేదు, త్వ‌ర‌గానే మెక్‌క‌ల‌మ్‌ను ఔట్ చేస్తాన‌నే న‌మ్మ‌కంతో ఉన్నా. టీ విరామం ముగిసింది. ఆ రోజు ఆట ముగిసే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా అత‌డు ఔట్ కాక‌పోవ‌డంతో నాలో అస‌హ‌నం పెరిగింది. విరాట్ కోహ్లీ ద‌గ్గ‌రికి వెళ్లి ఎందుకు క్యాచ్ మిస్ చేశావని అడిగా.. మ‌రుస‌టి రోజు లంచ్ సెష‌న్‌కు ముందు మ‌రో ఆట‌గాడి క్యాచ్‌ను మిస్ చేశారు. దీంతో చిరాకు వ‌చ్చి వెంట‌నే ఆ కోపంలో బౌన్స‌ర్ వేయ‌గా.. అది ధోని త‌ల‌మీదుగా వెళ్లింద‌'న్నాడు.

అప్ప‌టికే మెక్‌క‌ల్ల‌మ్ త్రిశ‌త‌కం సాధించాడు. ఇక భోజ‌నం కోసం డ్రస్సింగ్ రూమ్ కు వెలుతుండ‌గా.. మ‌హీ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. క్యాచ్ వ‌దిలేశాన‌ని తెలుసు కానీ చివ‌రి బంతిని చ‌క్క‌గా వేయాల్సిందని ప్ర‌శ్నించాడు. వెంట‌నే నేను చేజారింద‌ని జ‌వాబు చెప్పా. అప్ప‌డు ధోని గొంతు కొంచెం పెంచి.. నన్ను మంద‌లించాడు. 'నేను ఎంతో మంది ఆట‌గాళ్ల‌ను చేశాను. నాతో అబ‌ద్ధం చెప్ప‌కు. నీ కెప్టెన్‌ను పిచ్చివాడిని చేయెద్దు అని 'మ‌హీ అన్నాడ‌ని ష‌మీ తెలిపాడు. ఇక ధోని కెప్టెన్సీలోనే అన్ని ఫార్మాట్ల‌లో ష‌మీ అర‌గ్రేటం చేయ‌డం విశేషం.

Next Story