వార్నర్‌కు సినిమా ఛాన్స్ ఆఫర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2020 9:46 AM GMT
వార్నర్‌కు సినిమా ఛాన్స్ ఆఫర్

ఆస్ట్రేలియా విధ్వంస‌క బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్న‌ర్ వ‌రుస టిక్‌టాక్ వీడియోల‌తో దుమ్ములేపుతున్నాడు. లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమితం అయ్యాడు. త‌న భార్య క్యాండిస్ తో క‌లిసి టిక్ టాక్ వీడియోలు రూపొందిస్తున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైద‌రాబాద్ తరుపున ప్రాతినథ్యం వహిస్తున్న వార్నర్‌ టాలీవుడ్‌తో మంచి అటాచ్‌మెంట్‌ ఉంది. దీంతో ఇప్పటికే పలు దక్షిణాది పాటలకు టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. మొన్న అల్లు అర్జున్‌ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' పాటకు తనదైన స్టెప్పుల‌తో డ్యాన్స్ చేసిన ఈ స‌న్ రైజ‌ర్స్ కెప్టెన్‌.. తాజాగా పోకిరి సినిమాలోని ఓ ప‌వ‌ర్ పుల్ డైలాగ్ చెప్పి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాడు.

'పోకి‌రి' చిత్రంలోని ప‌వ‌ర్ పుల్ డైలాగ్‌ను టిక్‌టాక్ చేశాడు. "ఒక్క సారి క‌మిట్ అయితే.. నా మాట నేనే విన‌ను" అంటూ వార్న‌ర్ చేసిన టిక్‌టాక్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన చిత్ర ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ వార్న‌ర్‌ను మెచ్చుకున్నాడు. 'డేవిడ్‌ వార్నర్‌ ఇది నువ్వేనా!!. ఈ డైలాగ్‌ నీ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయింది. నువ్వు నటుడిగా కూడా రాణించగలవు. భవిష్యత్‌లో కుదిరితే నా సినిమాలో అతిథి పాత్ర ఇస్తా. లవ్యూ' అని ట్వీట్‌ చేశారు.

టాలీవుడ్ చిత్రంలో వార్న‌ర్ గ‌నుక యాక్టింగ్ చేస్తే.. అది కూడా పూరీ లాంటి డైరెక్ట‌ర్ చిత్రంలో ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఒక‌వేళ‌ పూరీ అవ‌కాశం ఇచ్చినా.. వార్న‌ర్ న‌టిస్తాడో లేదో తెలీదుగానీ.. ఒక వేళ వార్న‌ర్ న‌టిస్తే .. క్రికెట్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లే.. సినిమా రికార్డులు కూడా బ‌ద్ద‌లు అవుతాయ‌ని అంటున్నారు వార్న‌ర్ అభిమానులు.

ఇక ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఎప్పుడు ప్రారంభం అయినా ఆడ‌డానికి తాను సిద్దంగా ఉన్నాన‌ని చెప్పాడు వార్న‌ర్‌. ఐపీఎల్ త‌మ డెత్ బౌలింగ్ అత్యుత్త‌మైద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. భువ‌నేశ్వ‌ర్‌, ర‌షీద్ ఖాన్ వంటి బౌల‌ర్లు ఉండ‌డం త‌మకు బాగా క‌లిసివ‌స్తుంద‌ని అన్నాడు వార్న‌ర్‌.



Next Story