అందుక‌నే ఐపీఎల్ అంటే ఇష్టం : కోహ్లీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2020 7:38 AM GMT
అందుక‌నే ఐపీఎల్ అంటే ఇష్టం : కోహ్లీ

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) అంటే ఎంతో ఇష్టం అని అంటున్నాడు భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌స్తుతం కోహ్లీ ఇంటికే ప‌రిమితం అయ్యాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ క‌నెక్టెడ్ షోలో విరాట్ మాట్లాడాడు. ఐసీసీ టోర్న‌మెంట్‌ల‌తో పోల్చిన‌ప్పుడు త‌న‌కు ఐపీఎల్ అంటేనే ఇష్ట‌మ‌న్నాడు.

'ఐపీఎల్‌లో కొత్తగా ఆడే యువ క్రికెట‌ర్ల‌తో మన అనుభ‌వ‌వాలు పంచుకోవ‌చ్చు. ఎప్పుడో గానీ చూసే విదేశీ ఆట‌గాళ్ల‌తో త‌రుచూ క‌లిసి ఆడే అవ‌కాశం ఈ లీగ్ ద్వారానే క‌లుగుతుంది. ఐసీసీ టోర్నీల‌లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుతో మాత్ర‌మే త‌ల‌ప‌డ‌తాం. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఆట‌గాళ్ల‌తో పెద్దగా మాట్లాడ‌లేము. అదే ఐపీఎల్ లో అయితే.. వారితో క‌లిసి ఆడ‌వ‌చ్చు. వారి నుంచి కొన్ని కొత్త విష‌యాల‌ను నేర్చుకోవ‌చ్చున‌ని, అందుకే ఐపీఎల్‌ అంటే అందరికీ మోజే. అభిమానులకు క్రేజ్' అని విరాట్ అన్నాడు.

త‌న ఫేవ‌రేట్ మ్యాచ్ ఏది అని అడ‌గ‌గా.. ఇలాంటి ప్ర‌శ్న‌కు జ‌వాబు చెప్ప‌డం చాలా క‌ష్ట‌మ‌ని కోహ్లీ అభిప్రాయ‌ప‌డ్డాడు. త‌న కెరీర్‌లో చాలా మ్యాచులు త‌న‌కు గుర్తుండి పోతాయ‌ని అన్నాడు. అయితే.. అప్ప‌టి ప్రాధాన్య‌త‌ను బ‌ట్టి చూస్తే 2016 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ భాగంగా ఆస్ట్రేలియాతో మొహాలీ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ ఎంతో ప్ర‌త్యేక‌మ‌న్నాడు. ఆ మ్యాచ్‌లో ఓడిపోయే ద‌శ నుంచి మ్యాచ్‌ను గెలిచామ‌ని గుర్తుచేసుకున్నాడు కోహ్లీ.

మ‌ళ్లీ సాధార‌ణ రోజులు ఎప్పుడు వ‌స్తాయో చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని, క‌రోనా త‌రువాత ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయే అవ‌కాశం ఉంద‌న్నాడు. తను శారీరక దృఢత్వంకంటే మానసిక సంసిద్ధతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానని చెప్పాడు. అందుకే ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే తిరిగి అదేస్థాయిలో ఆటను మొదలుపెట్టే బలం తనలో ఉందన్నాడు. ఇక కోహ్లీ ఐపీఎల్ ప్రారంభ‌మైనప్ప‌టి నుంచి బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ త‌రుపున ఆడుతున్నాడు. తాను ఐపీఎల్ ఆడిన‌న్ని రోజులు బెంగ‌ళూరుకు త‌ప్ప మ‌రో జ‌ట్టుకు ఆడాల‌ని అనుకోవ‌డం లేద‌ని ఇటీవ‌ల విరాట్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

క‌రోనా ముప్పుతో చాలా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మరికొన్ని రద్దు అయ్యాయి. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కూడా మ‌హ‌మ్మారి ముప్పుతో నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబ‌ర్‌లో జ‌రిగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌పై కూడా నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే.. ఇప్ప‌ట్లో క్రీడ‌లు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం లేదు. అయితే.. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించే అవ‌కాశాల‌ను కొట్టి పారేయ‌లేము.

Next Story