కోహ్లీతో నా వైరం ఇప్ప‌టిది కాదు.. రూబెల్ హుసేన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2020 11:57 AM GMT
కోహ్లీతో నా వైరం ఇప్ప‌టిది కాదు.. రూబెల్ హుసేన్‌

కెరీర్ ఆరంభంలో భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీకి దూకుడు ఎక్కువ అనే విష‌యం తెలిసిందే. కెప్టెన్ అయ్యాక కొంత దూకుడును త‌గ్గించుకున్నాడు విరాట్. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాడు ఓ మాట అంటే.. విరాట్ రెండు మాటల‌తో స‌మాధానం చెబుతాడు. తాజాగా బంగాదేశ్ సీనియ‌ర్ పేస‌ర్ రూబెల్ హుస్సేన్ కోహ్లీతో ఉన్న వైరాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే త‌మ‌వైరం ఇప్ప‌టిది కాద‌ని.. అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ నుంచే న‌ని చెప్పుకొచ్చాడు.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా క్రికెట‌ర్లు ఇంటికే ప‌రిమితం అయ్యారు. కాగా.. త‌మీబ్ ఇక్భాల్ తో క‌లిసి రూబెల్ ఫేస్‌బుక్ లైవ్‌లో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా రూబెల్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలను చెప్పాడు.

'అండర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి నేను, కోహ్లీ త‌ల‌ప‌డుతూనే ఉన్నాం. ఇప్ప‌టితో పోల్చితే.. అప్పుడు కోహ్లీ మ‌రింత దూకుడుగా ఉండేవాడు. త‌రుచుగా స్లెడ్జింగ్ చేసేశాడు. అదే అత‌నికి అల‌వాటుగా మారింది. ఆ టోర్నీ నుంచే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌లు అయ్యాయి. కోహ్లీ స్లెడ్జింగ్ చేసే క్ర‌మంలో తిట్ల దండ‌కం అందుకునే వాడు. మేమిద్ద‌రం నోటికి ప‌ని చెప్పామంటే అంపైర్లు ఖ‌చ్చితంగా మ‌ధ్య‌లో క‌ల్పించుకుని స‌ర్ధి చెప్పాల్సి' వ‌స్తుంద‌న్నాడు.

2015 వన్డే ప్ర‌పంచ‌క‌ప్‌‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రూబెల్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో కోహ్లి ఔటయ్యాడు. అప్పుడు రూబెల్ వెరైటీగా సంబ‌రాలు చేసుకుంటూ కోహ్లీకి సెండాఫ్ చూపించాడు. అప్పుడు ఈ విష‌యం హాట్ టాఫిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.ఇలా తన సెండాఫ్‌ చెప్పడానికి వారి మధ్య కలిసి పెరుగుతూ వస్తున్న వైరమే కారణమనే విషయాన్ని రూబెల్‌ చెప్పకనే చెప్పేశాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాతో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా తనతో కోహ్లి వాగ్వాదానికి దిగిన విషయాన్ని రూబెల్‌ ప్రస్తావించాడు.

2008లో జ‌రిగిన అండ‌ర్ -19 ప్ర‌పంచ‌క‌ప్ ను కోహ్లీ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఇక కెరీర్ తొలి నాళ్ల‌లో కోహ్లీ ఎక్కువ‌గా దూకుడు ప్ర‌ద‌ర్శించేవాడు. మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని నుంచి చాలా నేర్చుకున్నాడు. అప్ప‌టితో పోలీస్తే ప్ర‌స్తుతం కోహ్లీతో కొంత దూకుడు త‌గ్గింద‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికి ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు క‌వ్విస్తే మాత్రం నోటితో, బ్యాట్‌తో చుక్క‌లు చూపిస్తాడు కోహ్లీ

Next Story