లాక్‌డౌన్ లోనూ వెరీ ఫైన్..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 20 Aug 2020 11:43 AM GMTలాక్‌డౌన్‌లో మనం డౌన్ కాకుండా ఉండాలంటే ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్‌లు, యోగా చేయాల్సిందే అంటోంది టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ఇలియానా. కేవలం అనడమే కాకుండా ఆ ఫిట్‌నెస్ ఎక్సరసైజ్‌లు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ పిక్‌లను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ మానసికంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదముంటుంది. అందులోంచి బైట నిరంతరం పడాలంటే ఏదో ఒక వ్యాపకం తప్పనిసరిగా ఉండాలి. ఇలియానా వ్యాయామం తన వ్యాపకంగా చేసుకుంది.
అనుకోకుండా కరోనా విజృంభించడం.. అనివార్యంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వంటి పరిణామాలతో ఎక్కడి వారు అక్కడే ఉన్నట్టుగా ఉండిపోతున్నారు. లాక్‌డౌన్ దశల వారీగా సడలిస్తున్నా.. బైటికి రావాలంటే భయంగానే ఉంటోంది. ఇంటి పట్టునే ఉండాలంటే బోర్ కొట్టడం ఖాయం. ఇలాంటి విపరీత పరిస్థితుల్లో మనకు తగిన పనులు ఎంచుకుని చేసుకుపోవడమే ఉత్తమం అంటోంది ఇలియానా.
లాక్‌డౌన్ ఏదో కొన్ని రోజులుంటుంది అంతే.. ఆ తర్వాత అంతా మామూలే అనుకున్న వారంతా ఇదేంటీ మరీ నెలలు గడుస్తున్నా కరోనా విజృంభణ ఆగట్లేదు అని మానసిక వత్తిడికి గురవుతున్నారు. ఇలియానా కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి ఫీలింగ్‌లతోనే సతమతమైంది. ‘అసలు ఇంత బ్రేక్ వస్తుందనుకోలేదు, అమ్మా నాన్నలు అమెరికాలో ఉంటున్నారు. వారిని విడిచి ఉండేదాన్నే కాదు కానీ అనుకోని పరిస్థితుల్లో ఇలా ఉండాల్సి వస్తోంది.’ అంటోంది. మొదట్లో టైమ్ పాస్ కోసం బేకింగ్ పనికి పూనుకొంది. కేకులు బ్రెడ్‌ల తయారీలో మునిగిపోయింది. కానీ ఎన్నాళ్ళని చేయాలి పైగా ఇలా కేకులు బ్రెడ్‌లు తింటూ కూర్చొంటే లాక్‌డౌన్ పూర్తయ్యేసరిగి ఫుట్‌బాల్‌లా తయారవడం ఖాయం అనుకుంది వెంటనే సుగర్, బ్రెడ్, ప్రాసెస్డ్ తిండికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది.
ఇలా కాదనుకుని తనకు తానే ఫిట్‌నెస్ ఛాలెంజ్ తీసుకుంది. ఈ ఫిట్‌నెస్ వల్ల మనసే కాదు శరీరం చురుగ్గా ఉంటుంది. అందుకే రోజూ ఓ గంట తప్పకుండా ఎక్సర్‌సైజ్‌కు కేటాయించుకుంది. అనుకున్నట్టుగానే ఫిట్‌నెస్ పనులు బాగానే చేస్తోంది. అయితే అన్నిటికన్నా మానసిక వత్తిడిని అధిగమించడం కష్టసాధ్యం. అయినవారిని కలుసుకోవడం కుదరదు. ఎంత సేపటికీ ఫోన్ల ద్వారానే మాట్లాడుకోవాలి. కానీ ఎంతకాలం ఇలా? ఈ ధ్యాసలోనే ఉంటే పిచ్చి పట్టిపోవడం ఖాయం. ఇలియానా కూడా ఇలాంటి క్లిష్ట సందర్భాన్నే ఎదుర్కొంది.
మొదట్లో ఒంటరిగా ఉండాలంటే ఏడుపు వచ్చినంత పనయ్యేదట. ఆ సమయంలో మనసు విచిత్ర ఆలోచనలు చేయకుండా అదుపులో ఉండగలిగిందంటే అది కేవలం ఈ వర్కవుట్ల వల్లనే అంటోంది. మొదట్లో పర్సనల్ ట్రైనర్ సమక్షంలో జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసేది. ఇప్పుడు ఇంట్లోనే ఒంటరిగానే చేస్తోంది. మొదట్లో జిమ్ విశాలంగా ఉంటుంది. మరి ఇల్లు చిన్నదవుతుందేమో.. విశాలంగా ఉండదేమో అనుకున్నా.. ఒక్కసారి రంగంలో దిగాకా అన్నీ సర్దుకున్నాయి. అసలు ఇల్లు కాదు మనసు విశాలంగా ఉండాలి అంటూ వ్యాఖ్యానించింది ఇలియానా.
అనుకోకుండా ఓరోజు జ్వరం వచ్చింది. రెండ్రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ రెండ్రోజులూ వర్కవుట్ చేయనందున చాలా అసౌకర్యం అనిపించి జ్వరం తగ్గగానే మళ్ళీ వర్కవుట్‌లు మొదలెట్టేశా అంది. కేవలం ఎక్సర్‌సైజ్‌లే కాకుండా తనకు పెయింటింగ్స్ అంటే కూడా చాలా ఇష్టమని ఇలియానా అంటోంది.
కాన్వాస్‌పై బొమ్మలు వేసి రంగులద్దుతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఆ బొమ్మల్ని చూపించే సాహసం చేయను.. బాగా వచ్చాయనిపిస్తే సోషల్ మీడియాలో పెడతా, ఆతర్వాత ఎగ్జిబిషన్ గురించి ట్రై చేస్తానంటున్న ఈ గ్లామర్ స్టార్ కరోనా పూర్తిగా తగ్గితే మొదట అమెరికాకు ఫ్లైట్లో రయ్ మంటూ ఎగిరి వెళ్ళి అమ్మ ఒడిలో వాలిపోతా అంటోంది. ఇలియానా ప్రస్తుతం బిగ్‌బుల్ లో అభిషేక్ బచ్చన్‌తో నటిస్తోంది. త్వరలో షూటింగ్ సురూ అవుతుందని ఆశిస్తోంది.