స్వ‌ర‌రాజా.. ఇళ‌య‌రాజా త్వ‌ర‌లో సొంత స్టూడియోలో..

By మధుసూదనరావు రామదుర్గం  Published on  16 July 2020 11:58 AM GMT
స్వ‌ర‌రాజా.. ఇళ‌య‌రాజా త్వ‌ర‌లో సొంత స్టూడియోలో..

స్వ‌ర‌రాజ ఇళ‌య‌రాజ‌.. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ల‌లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఇళ‌య‌రాజ సంగీతం అంటే చెవులు కోసుకునే అభిమానులు కోట్ల‌సంఖ్య‌లో ఉన్నారు. సినీ సంగీతంలో స్వ‌ర ర‌చ‌న చేయ‌గ‌లిగిన అపురూప సంగీత ద‌ర్శ‌కుల్లో ఇళ‌య‌రాజా అగ్ర‌గ‌ణ్యులు. మెలొడీ సంగీతం అందించ‌డంలో ఇళ‌య‌రాజ‌ది అందె వేసిన చేయి. పాట విన‌గానే ఇది త‌న‌ సంగీత‌మే అని చెప్ప‌గ‌లిగేంత సుస్ప‌ష్టంగా త‌న ముద్ర వేసిన ఇళ‌య‌రాజా త్వ‌ర‌లో సొంత స్టూడియో నిర్మించ‌బోతున్నారని తాజా స‌మాచారం.

త‌న అభిమానుల‌చే మేస్ట్రో అని ముద్దుగా పిలిపించుకునే ఇళ‌య‌రాజా త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో దాదాపు వెయ్యి చిత్రాల‌కు సంగీతం అందించిన స్వ‌ర ఘ‌నాపాఠి. ఇప్ప‌టిదాకా ప్రైవేటు స్టూడియోనే త‌న స్వ‌ర‌సృష్టి వేదిక‌గా మార్చుకున్న ఇళ‌య‌రాజా కొన్ని కార‌ణాల వ‌ల్ల బైటికి వ‌చ్చేశారు. ఇక‌పై చెన్నైలో నిర్మితం కానున్న సొంత స్టూడియోలో స్వ‌ర‌క‌స‌ర‌త్తులు చేయ‌నున్నారు.

నాలుగు ద‌శాబ్దాలుగా త‌న స్వ‌ర‌యాత్ర‌కు ఆన‌వాలుగా నిలిచిన స్టూడియోను వ‌ద‌లిన ఇళ‌య‌రాజా ప్ర‌స్తుతం ఇంట్లోనే చిన్న‌పాటి స్టూడియో సెట‌ప్ చేసుకున్నారు. కొన్ని వారాల కింద‌ట ఓ ప్రివ్యూ థియేట‌ర్ ను కొనుగోలు చేసిన ఇళ‌య‌రాజా త‌న అభిరుచి మేర‌కు భ‌వ‌నంలో మార్పులు చేసి స్టూడియోగా మార్చుకోవాల‌ని సంక‌ల్పించుకున్నారు.

త్వ‌ర‌లో స్టూడియో నిర్మాణ ప‌నులు ప్రారంభం కానున్నాయి. అధునాత‌న సాంకేతికత‌తో నిర్మిస్తున్న కొత్త స్టూడియో సెప్టెంబ‌ర్ నాటిక‌ల్లా సిద్ధం కానుంది. ఈ స్టూడియోలో సంగీతం నాణ్యంగా అందించేందుకు వీలుగా స‌రికొత్త ప‌రిక‌రాల‌ను అమ‌రుస్తున్నారు. ఇళ‌య‌రాజా 1976లో అన్న‌క్క‌లి సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ త‌ర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

ఆ చేతి మ‌హిమ ఏంటోగానీ ప‌లికే ప్ర‌తి స్వ‌రం సూప‌ర్ హిట్ అయింది. దాదాపు వెయ్యి సినిమాల‌కు సంగీతం అందించిన స్వ‌ర‌జ్ఞాని ఇళ‌య‌రాజ‌. న‌వ‌త‌రం సంగీత ద‌ర్శ‌కులకు ఇళ‌య‌రాజ సంగీత దేవుడు. ప్ర‌తి సినిమాలోనూ ఏదో కొత్త‌ద‌నం ప్ర‌ద‌ర్శించ‌నిదే అత‌నిలోని క‌ళాతృష్ణ చ‌ల్లార‌దు. కొన్ని ద‌శాబ్దాలుగా ప్రేక్ష‌కుల మ‌న‌సు రంజింప‌జేస్తునే ఉండే సంగీతం అందించ‌డం అషామాషీ కాదు.. అది అంద‌రి వ‌ల్ల సాధ్య‌ప‌డ‌దు. అందుకే ఒక్క సంగీత ద‌ర్శ‌కుడు అనేంత‌గా పరిశ్ర‌మించిన స్వ‌ర పండితుడు అత‌డు.

త‌మిళ చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించినా త‌న అసామాన్య ప్ర‌తిభ‌తో భాషాతీతంగా తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల సినిమాల‌కు సంగీతం స‌మ‌కూర్చారు. తెలుగులో ప్ర‌యోగాలకు పుట్టినిల్లుగా నిలిచిన వంశీ సినిమాల‌కు ఇళ‌య‌రాజే సంగీతం అందించారు. వంశీ కెమెరాకు దీటుగా రాజా సంగీత దాటి న‌డిచేది. ఏడుప‌దులు దాటిన వ‌య‌సులోనూ అలుపెర‌గ‌ని స్వ‌ర‌క‌ళాకారుడు ఆయ‌న‌. త‌న చేతిలో ప్ర‌స్తుతం అర‌డ‌జ‌న్ ప్రాజెక్టులున్నాయి. ఇళ‌య‌రాజా త్వ‌ర‌లో సొంత స్టూడియో ప్ర‌వేశం చేసి రెట్టించిన ఉత్సాహంతో స‌రికొత్త ప్ర‌యోగాలు చేస్తారేమో చూద్దాం!!

Next Story