ఐపీఎల్ రద్దు అయితే రూ.5వేల కోట్ల నష్టం
By తోట వంశీ కుమార్ Published on 21 April 2020 4:41 PM GMTకరోనా వైరస్ దెబ్బకు క్రీడారంగం కుదేలైంది. ఈ మహమ్మారి వల్ల కొన్ని క్రీడలు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా లీగులు నిలిచిపోయాయి. దీంతో ఆయా బోర్డులకు ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లింది. ఇక ప్రపంచ క్రికెట్‌లో ధనిక బోర్డు అయిన బీసీసీఐకి కూడా ఈముప్పు తప్పలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బీసీసీఐకి బంగారు బాతు. బీసీసీఐకి లభించే ఆదాయంలో సింహభాగం ఐపీఎల్ ద్వారానే వస్తోంది. కరోనా ముప్పుతో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పట్లో ఐపీఎల్ జరిగే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ ఈ సంవత్సరం ఐపీఎల్ రద్దు అయితే.. బీసీసీఐ, ప్రాంఛైజీలకు రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లనుందని అంచనా.
ఇక భీమా చేయించినట్లయితే.. ఏదైన కారణం వల్ల ఆటలు రద్దు అయితే.. ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు చెల్లిస్తుంది. అందుకు వింబుల్డన్ ఛాంపియన్ షిప్ ఉదాహారణ. మహమ్మారుల సమయంలో వర్తించేలా ఆ టోర్నీ నిర్వాహకులు భీమా చేయించారు. కరోనా ముప్పుతో టోర్నీ రద్దు అయినా.. భీమా చేయిండంతో దాదాపు 90శాతంపైగా నష్టాలను తప్పించుకున్నారు ఆ నిర్వాహకులు. కాగా.. బీసీసీఐతో పాటు అనేక ఐపీఎల్ జట్లకు కూడా కరోనా మహమ్మారికి వర్తించే భీమా లేదని హోడెన్ అనే ప్రైవేట్ కంపెనీ తన నివేదికలో పేర్కొంది.
బీసీసీఐ సంప్రదించే సమయానికే ఇన్సూరెన్స్ కంపెనీ తమ కవరేజీ క్లాజ్ నుంచి కరోనా మహమ్మారిని తొలగించిందని చెప్పింది. బీసీసీఐతో పాటు అనేక ప్రాంఛైజీలకు భీమా సౌకర్యం ఉంది. ఆ ఫ్రాంచైజీలు కూడా ఫిబ్రవరి, మార్చి నాటికి గానీ తమ బీమా కంపెనీలను సంప్రదించడం మొదలు పెట్టలేదట. అప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మహమ్మారిగా ప్రకటించడంతో.. బీమా కంపెనీలు నిబంధనలను మార్చాయి. ఇన్సూరెన్స్ కింద డబ్బులు చెల్లించే అవసరం లేకుండా నిబంధనలు మార్చడంతో.. బీసీసీఐకి ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ రాదని సదరు కంపెనీ చెప్పింది.