ఆ ప‌ని చేయ‌మంటే అక్ర‌మ్‌ని చంపేసేవాడిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2020 2:01 PM GMT
ఆ ప‌ని చేయ‌మంటే అక్ర‌మ్‌ని చంపేసేవాడిని

పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు షోయ‌బ్ అక్త‌ర్ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. పాక్ మాజీ కెప్టెన్ వ‌సీం అక్ర‌మ్ త‌న‌ను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాల‌ని ఒత్తిడి చేసి ఉంటే.. అత‌డిని కచ్చితంగా చంపేసేవాడ‌ని అన్నాడు. పాకిస్థాన్ జ‌ట్టులో చాలా మంది క్రికెట‌ర్లు ఫిక్సింగ్ భూతం కార‌ణంగా త‌మ కెరీర్ నాశ‌నం చేసుకున్నార‌ని గ‌తంలో ఈ రావ‌ల్సిండి ఎక్స్‌ప్రెస్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా.. మంగ‌ళ‌వారం ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అక్త‌ర్ మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడే రోజుల్లో అప్ప‌టి కెప్టెన్ వ‌సీం అక్ర‌మ్ త‌న‌ను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డాల‌ని ఒత్తిడి తెచ్చి ఉంటే.. అత‌డి కెరీర్ నాశ‌నం చేయ‌డ‌మో లేదా అత‌డిని చంప‌డమో చేసేవాడిన‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. అయితే.. అక్ర‌మ్ ఇలాంటి ప్ర‌తిపాద‌న‌తో త‌న ముందుకు ఎన్న‌డూ రాలేద‌న్నాడు.

త‌న‌ను కొన్ని సార్లు బుకీలు సంప్ర‌దించార‌నీ, మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్ప‌డాల‌ని కోరాడ‌న్నారు. అయితే.. తాను మాత్రం ఎప్పుడూ ఫిక్సింగ్ పాల్ప‌డ‌లేద‌ని.. అలాంటి ప్ర‌తిపాద‌న‌తో వ‌చ్చిన బుకీల‌ను వెంట‌నే వెన‌క్కి పంపేవాడినన్నారు. 21 మంది ఆడే ఆట‌లో ఎంత మంది మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డుతున్నారో ఎవ‌రికి తెలుసు..? అలాంటి వారిని గుర్తించ‌డం కూడా క‌ష్ట‌మ‌న్నాడు. అక్రమ్‌తో క‌లిసి ఎనిమిది సంవ‌త్స‌రాలు క‌లిసి ఆడాన‌ని.. జ‌ట్టు ఓడిపోయే సంద‌ర్భంలో ఎన్నో సార్లు అక్ర‌మ్ త‌న బౌలింగ్‌తో పాక్‌కు విజ‌యాలు అందించాడ‌ని, ప్ర‌త్య‌ర్థి జ‌ట్టులోని టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ల‌ వికెట్లు తీసే బాధ్య‌త‌ను అక్ర‌మ్ తీసుకునేవాడ‌ని.. త‌న‌కి టెయిలెండ‌ర్ల వికెట్లు తీయాల‌ని చెప్పేవాడ‌ని అక్త‌ర్ తెలిపాడు. పాక్ త‌రుపున అక్త‌ర్ 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వ‌న్డేల్లో 247 వికెట్లు తీశాడు.

Next Story