ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..?
By అంజి
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అఖండ మెజార్టీతో విజయం సాధించే పార్టీ అదేనంటూ ఓ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. కాగా, ఒకానొక సమయం వరకు ఏదైనా ఒక ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై విశ్లేషణలు జరిగేవి. పొలిటికల్ ట్రెండ్‌లో భాగంగా ఐదేళ్లు కాస్తా ఏడాదికి, ఏడాది కాస్తా నెలకు వచ్చి చేరింది. ఇలా నెలలో ప్రభుత్వ పనితీరుపై విశ్లేషణలు చేయడం వైఎస్ జగన్ సీఎం అయ్యాక కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.
ఒకపక్క ఒక్కో నెలకు సంబంధించిన పాలన రిపోర్టును ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయకపోయినా, వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ పాలన బహు భేష్ అంటూ మీడియా సమావేశాల్లో చెప్పుకొస్తున్నారు. మరోపక్క జగన్ పాలనపై ఆరు నెలలపాటు తామేమీ మాట్లాడమని చెప్పిన ప్రతిపక్షాలు ఒక్క మాసానికే విమర్శలకు పనిచెప్పక తప్పలేదు. ప్రజా వేదికతో మొదలైన అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం ప్రస్తుతానికి మూడు రాజధానుల అంశం వరకు చేరుకుంది.
మధ్య మధ్యలో ఇసుక కొరత, వాలెంటీర్ల వ్యవస్థ, ఆంగ్ల మాధ్యమం వంటి అంశాలపై పొలిటికల్ వార్ జరిగినా మూడు రాజధానుల అంశం మాత్రమే గత కొన్ని నెలలుగా కొనసాగుతూ వస్తోంది. రాజధాని నిర్మాణం పేరుతో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించిన జగన్ సర్కార్, అందుకు సంబంధించి నిజా నిజాలను తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. మరోపక్క సీఎంగా జగన్ అవగాహన రాహిత్య పాలనతో ప్రజలు విసిగిపోయారని, మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయమే అందుకు నిదర్శనమంటూ ప్రతిపక్షాలు చెప్పుకొస్తున్నాయి.
ఇలా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు మాత్రం వారి వారి అభిప్రాయాలను మీడియాతో పంచుకుంటున్నారు. తాజాగా, మీడియాతో మాట్లాడిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఆ పార్టీనేనంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంతకీ కేతిరెడ్డి చెప్పిన అభిప్రాయమేంటి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది? అన్న విషయాలను క్షుణ్ణంగా చెప్పుకొచ్చారు.
ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మాట్లాడిన కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిన విషయం వాస్తవమేనని, వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్‌టెండరింగ్ విధానంతో అది తేటతెల్లమైందన్నారు. తాజాగా, బయటపడ్డ ఈఎస్ఐ కుంభకోణం కూడా టీడీపీ ప్రభుత్వ అవినీతిలో మచ్చు తునకగా ఆయన పేర్కొన్నారు. టీడీపీ పాలనపై సిట్ బృందం విచారణ జరుపుతోందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా జరిగిన అవినీతి కుంభకోణాలు ఆధారాలతో సహా త్వరలో బయటపడనున్నాయన్నారు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి. ఈ లెక్కన ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం టీడీపీ, జనసేన గెలుపొందిన నియోజకవర్గాల్లోని ప్రజలు కూడా వైసీపీ పట్టం కడతారని, దాంతో వైసీపీ బలం కాస్త 151 సీట్ల నుండి 175కు చేరుతుందని ఆయన అన్నారు.