Fact Check : ఐస్ ల్యాండ్ దేశంలో దోమలన్నవే ఉండవా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Sep 2020 11:43 AM GMT
Fact Check : ఐస్ ల్యాండ్ దేశంలో దోమలన్నవే ఉండవా..?

ప్రతి ఏడాది దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల కారణంగా ప్రపంచమంతా 10 లక్షల మందికి పైగా మరణిస్తూ ఉంటారు. 3000 రకాల దోమల జాతులు ఎన్నో రోగాలను వ్యాప్తి చేస్తున్నాయి. ఎన్నో దేశాల్లో దోమలను చంపడానికి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు పెడుతూ ఉన్నాయి.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. 'ఐస్ ల్యాండ్ దేశంలో ఒక్క దోమ కూడా కనపడదని.. దోమలు, పాములు.. ఇతర సరీసృపాలు ఉండవు. అతి తక్కువ జాతులకు చెందిన సాలీడులు మాత్రమే ఉంటున్నాయి. ఇవేవీ మనుషులకు హాని చేయవు' అంటూ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లలో కూడా ఈ పోస్టులను తెగ షేర్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఈ పోస్టు 'పాక్షికంగా నిజం'.

దోమలు ఐస్ ల్యాండ్ దేశంలో లేవన్నది నిజమే.. అయితే ఐస్ ల్యాండ్ ఒక్కటే దోమలు లేని ప్రాంతం కాదు. అంటార్కిటికా దేశంలో కూడా దోమలు అసలు లేవు.

న్యూస్ మీటర్ ఈ విషయంపై సమాచారాన్ని సంపాదించింది. ఐస్ ల్యాండ్ లో ఉన్న వాతావరణం కారణంగా దోమలు అసలు బతకలేవట. ఉన్నపాటుగా వాతావరణంలో వచ్చే మార్పులకు అక్కడ దోమలు బ్రతికే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

Icelandic Web of Science ప్రకారం.. ఐస్ ల్యాండ్ దేశంలో దోమలు కనిపించవు. ఆ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో దోమలు ఉంటున్నప్పటికీ అక్కడ మాత్రం దోమలు లేవట..! ఐస్ ల్యాండ్ దేశంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా దోమలు తమ లైఫ్ సైకిల్ ను పూర్తీ చేయలేవు. ప్యూపా దశ నుండి పూర్తిగా రూపాంతరం చెందడం దోమలకు వీలు పడదు..! నీటి లోనూ, కుంటల్లోనూ ప్యూపా దశలోనే గడ్డ కట్టిపోతూ ఉండడంతో దోమలు బ్రతకడం కష్టం అవుతుంది.

ఐస్ ల్యాండ్ లో ఇతర రకాల పురుగులు బ్రతుకుతూ ఉన్నాయి. జంతువుల నుండి రక్తం పీల్చే పురుగులు అక్కడ చాలానే ఉన్నాయట.

India Today కథనం ప్రకారం ఆ దేశంలో ఉండే నీరు, మట్టిలో ఉండే కెమికల్ కాంపోజిషన్ కూడా చాలా ముఖ్యమైనదని చెబుతూ ఉన్నారు. కొన్ని పురుగులు అక్కడి వాతావరణానికి బ్రతకగలుతూ ఉన్నాయని.. కానీ దోమలు బ్రతకడం కుదరట్లేదని చెబుతూ ఉన్నారు శాస్త్రవేత్తలు.

Icelandtravel.is ప్రకారం.. ఐస్ ల్యాండ్ లో దోమలు, పేలు, ఎలుగు బంట్లు, విషపూరితమైన సాలీడులు, పాములు.. ఇతర ప్రమాదకరమైన జంతువులు లేవని చెబుతోంది. ఎక్కడైనా అడవుల్లో కావాలంటే తమ దేశంలో క్యాంపును ఏర్పాటు చేసుకోవచ్చని.. పురుగులతో కొట్టించుకోవడం లాంటిది ఉండదని తెలిపింది సదరు వెబ్సైట్. ఆ దేశంలో ఆర్కిటిక్ నక్కలు మాత్రమే ప్రమాదకరమైనవని తెలుస్తోంది. అవి దాదాపు మనుషులకు దూరంగానే ఉంటాయని.. అప్పుడప్పుడు తిండిని వెతుక్కుంటూ జనావాసాల్లోకి వస్తుంటాయని చెబుతున్నారు.

ఐస్ ల్యాండ్ లో ఉన్న దోమలు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా అంతమైనట్లు భావిస్తూ ఉన్నామని ఎంటోమాలజిస్టులు చెబుతున్నారు. కానీ వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఐస్ ల్యాండ్ లో కూడా దోమలు బ్రతికే రోజులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. వేసవి కాలంలో దోమలు పునరుత్పత్తి చెందే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. దోమలంటూ లేని ఫ్రెంచ్ పాలినేషియా, కాలెడోనియా, సేచెల్లెస్, అంటార్కిటికా ప్రాంతాల్లో కూడా వాతావరణ మార్పుల కారణంగా అవి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టు 'పాక్షికంగా నిజమే'. ఐస్ ల్యాండ్ లో దోమలు లేవు. అలాగే అంటార్కిటికాలో కూడా దోమలన్నవి బ్రతకడం లేదు.

Next Story