అసలే తొలి వన్డేలో ఓడిన టీమిండియాకు.. ఐసీసీ భారీ షాక్
By Newsmeter.Network
అసలే తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా మరో షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డేల్లో 347 పరుగుల భారీ స్కోర్ సాధించినా కూడా విజయం వరించలేదు. అసలే బాధలో ఉన్న కోహ్లీ సేనకు ఐసీసీ ఝలక్ ఇచ్చింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాతం కోత విధించింది. స్లో ఓవర్ రేట్(నిర్ణీత సమయానికి మ్యాచ్ ముగించకపోవడమే) అందుకు కారణం. నిర్ణీత సమయంలో ఓవర్లు వేయలేపోయిన టీమిండియా 4 ఓవర్లు ఆలస్యంగా మ్యాచ్‌ను ముగించిందని పేర్కొంటూ ఐసీసీ రిఫరీ కిస్‌బ్రాడ్ కోత విధించారు. ఓవర్‌కు 20 శాతం చొప్పున నాలుగు ఓవర్లకు కలిపి 80 శాతం టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్లోఓవర్ రేట్‌ను అంగీకరించిన నేపథ్యంలో తదుపరి ఎలాంటి విచారణ ఉండదని రిఫరీ స్పష్టం చేశారు.
ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం ప్రతి ఓవర్ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. లేనిపక్షంలో ఒక ఓవర్‌కు 20 శాతం చొప్పున ఆటగాళ్లు, ఆ జట్టు సిబ్బంది మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. ఇదిలావుండగా.. వెల్లింగ్టన్‌లో జరిగిన నాలుగో టీ20లోనూ, మౌంట్‌మాంగనీలో జరిగిన చివరి ఐదో టీ20 లోనూ స్లోఓవర్ రేటు కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో వరుసగా.. 40 శాతం, 20 శాతం కోత విధించారు. టీమిండియా ఆటగాళ్లకు జరిమానా విధించడం వరుసగా మూడో సారి.
ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే చేధించింది న్యూజిలాండ్ జట్టు. అయితే, భారీ స్కోరును కాపాడుకోలేపోయిన విరాట్ సేనకు స్లోఓవర్ రేట్ రూపంలో మరో భారీ షాక్ తగిలింది.