చెదరని చిరునవ్వే తన ఆయుధం.. ఆభరణం.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 24 July 2020 3:22 PM ISTఈ సృష్టిలో మనిషికి తప్ప ఏ ఇతర జీవికీ దక్కని గొప్ప వరం నవ్వడం. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అని ఊరకే అనలేదు. ఇవాళరేపు ప్రతి మల్టీనేషనల్ కంపెనీల్లో కొలువు కోసం వచ్చే ఉద్యోగులను మనసారా నవ్వండంటూ యాజమాన్యం ప్రోత్సహిస్తోంది. గుండెలో గూడుకట్టుకున్న దిగులిని పటాపంచలు చేయగల శక్తి ఒక్కనవ్వుకే ఉంది. యువ ఐఏఎస్ అధికారి టీనా దాబి కూడా ఇదే అంటోంది. నవ్వడం నవ్వుతూ పనిచేయడం మన విజయానికి ఓ తారకమంత్రం అని చెబుతోంది.
టీనా రాజస్థాన్ లోని బిల్వారాలో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వర్తిస్తోంది. ఇరవైఏడేళ్ల టీనా ఎప్పుడూ నవ్వుతునే ఉంటుంది. విధుల్లో ఎంత బరువు బాధ్యతలు ఉన్నా..వాటిని జాగ్రత్తగా నిర్వహిస్తునే ఇతర వ్యాపకాల్లోనూ తలమునకలై ఉంటోంది. బ్రిక్స్ స్టీరింగ్ కమిటీకి సలహాదారిగా వ్యవహరిస్తోంది. బ్రిక్స్ కమిటీ సభ్యులు అవసరమైనపుడు సలహాలు సూచనల కోసం టీనాకు కాల్ చేస్తుంటారు. వెబ్ మీటింగ్ లలోనూ టీనా పాల్గొంటుంటుంది.
ఇదంతా ఒక కోణం అయితే తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. తల్లిదండ్రులు పలుకుబడి ఉన్నవారు కాబట్టే టీనా కెరీర్ ఇంత సాఫీగా అనుకున్నవి అనుకున్నట్టుగా సాగుతున్నాయని ఘాటైన విమర్శలు ఎదుర్కొంటోంది.
భారత ప్రభుత్వంలో కేబినెట్ కార్యదర్శి కావాలన్నది టీనా కల. ఆ కలల్ని నిజం చేసుకోడానికి అహరహం శ్రమించింది. తను ఒకటి కోరితే అదృష్టం రెండు ఇచ్చింది అన్నట్టుగా బ్రిక్స్ కమిటీకి గౌరవ సలహాదారుగా అవకాశాన్ని అందుకుంది. ఈ పదవి బ్రిటన్, చైనా, రష్యా, దక్షణాఫ్రికాలను చూసిరావడానికి అనువైన వాహకం. అయితే రాత్రికి రాత్రే ఇన్ని అవకాశాలు టీనా ఇంటి ముందు క్యూ కట్టలేదు. ఈ కొలువుల సాధన వెనక తన అవిరళ కృషి ఉంది.
ఇప్పటి కరోనా నేపథ్యంలో భిల్వారాలో వైరస్ రాకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టింది. సరిహద్దుల్లో గట్టి బందోబస్తు పెట్టించింది. ఈ చర్యతో టీనా చాలామంది కంట్లో పడింది. ఉత్సాహంగా ఉరకలేసేనట్టుండే ఈ అధికారి గురించి ఆసక్తిగా గూగుల్ చేసి తెలుసుకున్నారు నెటిజన్లు. ఇప్పుడే కాదు అయిదేళ్ల కిందట యూపీఎస్సీని క్రాక్ చేసి ఫస్ట్ ర్యాంకు సాధించినపుడే టీనా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి రాకుండా, విజృంభించకుండా ఉండి ఉంటే టీనా బ్రిక్స్ కమిటీని తన సూచనలతో నడిపించేందుకు రష్యా పీటర్స్ బర్గ్ లో జరగాల్సిన బ్రిక్స్ సదస్సులో టీనా దాబి మెరిసిపోయేది.
ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో టీనా బి.ఎ. పొలిటికల్ సైన్స్ పట్టా తీసుకుంది. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే ఐఏఎస్ పరీక్షల కోచింగ్ తీసుకుంది. డిగ్రీ పూర్తయిన రెండేళ్లకే టీనా సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ముస్సోరిలోని ట్రైనింగ్ లోనూ రాష్ట్ర పతి బంగారు పతకం అందుకుంది. జీవితంలో ఉన్నత శిఖరాలు అంచలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో ఆ ట్రైనింగ్ లోనే అమీర్ ఉల్ షఫీఖాన్తో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమ, పెళ్ళిగా మారింది.
తన లక్ష్యసాధనలో తోడ్పాటు అందించే జీవిత భాగస్వామి లభించాడని ఆనందంతో టీనా పొంగిపోయింది. అమీర్ ఆనందానికి అవధుల్లేవు. ఇద్దరూ పరస్పర అవగాహనతో ఉన్నత లక్ష్యాల దిశగా దూసుకుపోతున్నారు. అమీర్ కు రాజస్థాన్ లో పోస్టింగ్ జమ్ము కశ్మీర్ అడిగినా దక్కలేదు. టీనా హర్యానా అడిగితే రాజస్థాన్ పోస్టింగ్ అయింది. ఇలా అనుకోకుండా కాలం కలిసొచ్చి దంపతులు ఇద్దరూ ఒకే రాష్ట్రంలో ఉన్నత సేవలందిస్తున్నారు. ఇద్దరికీ సాహిత్యమంటే ప్రాణం. అమీర్ కవిత్వం అల్లితే టీనా మంచి చదువరి. ఇంగ్లిష్ నవలలంటే మక్కువ.
టీనా తండ్రి జస్వత్ దాబి బిఎస్ఎన్ఎల్‌లో జనరల్ మేనేజర్, తల్లి హిమానీ దాబీ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో అధికారి. పిల్లల కోసం ఉద్యోగం మానేశారు. టీనా చిన్నప్పటి నుంచే ఢిల్లీలో వచ్చి స్థిరపడ్డారు. తల్లిదండ్రులు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు, వారికి పలుకుబడి ఉంది కాబట్టే టీనాకు ఎక్కడలేని ప్రాధాన్యం లభిస్తోందని సోషల్ మీడియాలో ఈ మధ్యన ట్రోల్ చేస్తున్నారు. బ్రిక్స్ లో వచ్చిన అవకాశం కూడా టీనా ప్రతిభతోకాదు.. తల్లిదండ్రుల ఇన్‌ఫ్లుయన్స్ తో అని దారుణ కామెంట్లు వస్తున్నాయి. మరొకరు అయితే ఈ ట్రోలింగ్ కు మానసికంగా కుంగిపోయి ఉండేవారు. కానీ టీనాదాబి తన చిరునవ్వుతో ఈ అనవసర విమర్శలను తుడిచేస్తోంది.
వాస్తవంగా ఆలోచిస్తే ఒక వేళ తల్లిందండ్రుల పలుకుబడే పనిచేస్తోందనుకుంటే.. టీనాదాబి తన స్టడీ కెరీర్ మొత్తం ర్యాంకులతో కనిపిస్తోంది. ఈ క్లాసులో అయినా తనే టాపర్ గా నిలిచింది. ప్రతిభా పాటవం లేకుంటే ఇంతటి ఎదుగుదల ఎలా సాధ్యం? ఈ చిన్నలాజిక్ మరచిపోయిన కొందరు చేసే కువ్యాఖ్యలకు తనెందుకు స్పందించాలని టీనా అంటోంది. నిజమేగా! లక్ష్యసాధనలో బిజీగా ఉన్నవారెవరూ ఇలాంటి చిన్నచిన్న విషయాలను అస్సలు పట్టించుకోరు. మరి వారేం చేస్తారు ఏం చేయగలరు అంటే.. హాయిగా నవ్వేస్తారు టీనా లాగ!!