అతన్ని చూస్తే భయం వేసేది.. నేను కెప్టెన్ అయ్యాక కూడా నన్ను మందలించేవాడు : కపిల్ దేవ్
By తోట వంశీ కుమార్ Published on 15 July 2020 8:25 PM IST![అతన్ని చూస్తే భయం వేసేది.. నేను కెప్టెన్ అయ్యాక కూడా నన్ను మందలించేవాడు : కపిల్ దేవ్ అతన్ని చూస్తే భయం వేసేది.. నేను కెప్టెన్ అయ్యాక కూడా నన్ను మందలించేవాడు : కపిల్ దేవ్](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/07/Untitled-6-copy-10.jpg)
భారత్ తొలి ప్రపంచకప్ అందించిన దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్. కాగా.. ఓ సీనియర్ ఆటగాడు అంటే కపిల్‌దేవ్ కి భయమంట. అతగాడికి కనపడకుండా ఓ మూలకు దాక్కుకునేవాడినని ఈ మాజీ ఆల్‌రౌండర్ అన్నారు. తాను కెప్టెన్ అయ్యాక కూడా తనను మందలించేవాడిని, అయితే.. ఆయనది ప్రేమించే స్వభావమేనని చెప్పుకొచ్చాడు కపిల్.
భారత మాజీ ఓపెనర్ వీవీరామన్‌తో ఓ ఇంటర్వ్యూలో చిట్‌చాట్ చేసిన కపిల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బిషన్ బేడి కెప్టెన్సీలో అరగ్రేటం చేశాడు కపిల్‌దేవ్. తన కెరీర్‌లో ఎక్కువ కాలం సునీల్ గవాస్కర్ సారథ్యంలో ఆడాడు. అయితే.. 1978-79 సీజన్‌లో మాత్రం సిన్నర్ వెంకటరాఘవన్ కెప్టెన్సీలో ఆడాడు. అప్పుడు తాను కుర్రాడిని కావడంతో ఆ సమయం చాలా కష్టంగా గడిచిందని చెప్పాడు. తన ముఖం చూస్తేనే వెంకటరాఘవన్ చిరాకు పడేవారన్నాడు.
ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ సందర్బంగా ఈవ్‌నింగ్ బ్రేక్‌ను టీవిరామం అనేవారు. కానీ వెంకటరాఘవన్ మాత్రం అది టీ బ్రేక్ ఒక్కటే ఎందుకైతది. కాఫీ బ్రేక్ కాదా? అని వాదించేవాడు. అతని మనస్థత్వం అలా ఉండేది. అతన్ని చూసి నేను చాలా భయపడేవాడిని. ఎందుకంటే అతనెప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడేవాడు. అలాగే వెంకటరాఘవన్ కోపం గురించి మాకు బాగా తెలుసు. చివరకు అతను అంపైర్‌గా ఉన్నప్పుడు నాటౌట్ ఇచ్చే విధానం బౌలర్‌ను తిడుతున్నట్లు ఉండేదన్నాడు.
'1979లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు అతడు కెప్టెన్. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఆయనకు కనిపించకుండా ఉండే సీటును వెతుక్కునేవాడిని, బేడీ, ప్రసన్న, చంద్ర శేఖర్ వంటి సీనియర్ ఆటగాళ్లు నాతో బాగానే ఉండేవారు. ఇక బ్రేక్ ఫాస్ట్ సమయంలో వెంకటరాఘవన్ కనబడకుండా ఓ మూలన కూర్చొని తినేవాడిని. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువగా తినేవాడిని. అతను చూస్తే ఎప్పుడూ తినడమేనా అని తిడుతాడని అలా చేసేవాడిని.'అని కపిల్ గుర్తు చేసుకున్నాడు.
'ఇక 1983లో నా కెప్టెన్సీలో వెస్టిండీస్ పర్యటకు వెళ్లాం. బార్భడోస్‌లో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాం. పిచ్‌ను బౌన్సీగా ఉండడంతో.. పేసర్లకు ఎక్కువగా బౌలింగ్ ఇచ్చాను. మొదట స్పిన్నర్‌గా రవిశాస్త్రి బంతి నిచ్చాను. అప్పుడు స్లిప్‌లో ఆఫ్ స్పిన్నర్ అయిన వెంకటరాఘవన్ నా దగ్గర వచ్చాడు. నేను బౌలింగ్ చేయనని చెప్పానా ? అని ప్రశ్నించారు. అప్పుడు కెప్టెన్ ఎవరో నాకర్థం కాలేదు. అయితే సరే వెంకీ.. మీసమయం వస్తుంది అని బదులిచ్చాను. ఆయనది ప్రేమించే స్వభావమే. కెప్టెన్ అయినప్పటికీ ఆయన నన్ను మందలించేవారు' అని ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నారు.