ఆస్ట్రేలియాలో సిరీస్ నువ్వు గెలవాలని కోరుకుంటున్నా.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 July 2020 9:16 AM GMT
ఆస్ట్రేలియాలో సిరీస్ నువ్వు గెలవాలని కోరుకుంటున్నా.!

భారత జట్టు ఆస్ట్రేలియా టూర్ కు వెళ్ళడానికి కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. క్రికెట్ అభిమానులు మాత్రం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. అక్టోబర్ నెలలో కోహ్లీ సేన ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. మూడు టీ20 మ్యాచ్ లు ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆ తర్వాత నాలుగు టెస్ట్ మ్యాచ్ లను ఆడనుంది. ఆ టూర్ లో మూడు వన్డేలను కూడా ఆడనుంది. డిసెంబర్ 3న గబ్బా వేదికగా భారత జట్టు తొలి టెస్ట్ ఆడనుంది.

చివరిసారి కోహ్లీ టీమ్ ఆస్ట్రేలియా టూర్ కు వెళ్ళినప్పుడు 2-1తో సిరీస్ ను గెలిచి సరికొత్త చరిత్ర లిఖించింది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన మొదటి ఆసియా టీమ్ గా భారతజట్టు నిలిచింది. ఈ ఏడాది కూడా భారత జట్టు సిరీస్ ను గెలవాలంటే పడాల్సి ఉంటుంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లు ఆస్ట్రేలియా జట్టులో ఉండనున్నారు. ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ ఆటగాళ్ల బలాబలాలను బాగా అంచనా వేశాడు. భారతజట్టును ఢీకొట్టే టీమ్ ను లాంగర్ రెడీ చేస్తున్నాడు.

భారత జట్టు మాజీ కెప్టెన్, బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే కోహ్లీతో ఈ సిరీస్ గురించి చర్చించాడట. ఈ ఏడాది కూడా ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవాలని కోరాడట. ఇండియా టుడేతో గంగూలీ మాట్లాడుతూ విరాట్ తో తాను సిరీస్ గెలిచి రావాలని కోరానన్నాడు. 'కోహ్లీ నీ స్థాయి పెరిగింది.. ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటూ వెళతావో.. అప్పుడు నీ వెంట నీ టీమ్ కూడా ఉంటుంది.. నేను కూడా టీవీలో చూస్తూ ఉంటాను.. భారతజట్టు ఆడడం మాత్రమే నేను కోరుకోను.. తప్పకుండా గెలవాలనే కోరుకుంటాను.. ఎందుకంటే నీ స్థాయి పెరిగింది.. ఆ స్థాయికి తగ్గట్టే ఆడాలి' అని కోహ్లీతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చాడు గంగూలీ.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి కోహ్లీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నానని.. కోహ్లీతో టచ్ లో ఉన్నానని తెలిపాడు గంగూలీ. కోహ్లీతో పాటు అందరూ ఫిట్ గా ఉండాలని కోరుకుంటూ ఉన్నానని.. ఆ విషయాలను కూడా కోహ్లీతో అడిగానన్నాడు గంగూలీ. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారని.. ప్రాక్టీస్ చేయడానికి ఫిట్ గా ఉండడానికి చాలా తేడా ఉందని చెప్పాడు గంగూలీ.

ఆరు నెలలుగా క్రికెట్ ఆడకుండా.. డైరెక్ట్ గా వచ్చి మ్యాచ్ ఆడడం అంటే చాలా కష్టమైనదన్నాడు గంగూలీ. భారత జట్టు బెస్ట్ బౌలర్లు ఫిట్ గా ఉండాలని.. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టినప్పుడు మ్యాచ్ ఫిట్నెస్ వాళ్లు సాధించి ఉండాలని అన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా సిరీస్ మరింత కఠినంగా ఉండబోతోంది. 2018లో సిరీస్ ను సొంతం చేసుకున్నంత సులువుగా అయితే ఉండదు.. కానీ భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ పటిష్టంగా ఉందని నమ్మకంగా చెప్పాడు గంగూలీ.

Next Story