కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ సొంతం చేసుకున్న హోల్డర్.. కోహ్లీ, బుమ్రా ఏ ర్యాంకుల్లో ఉన్నారంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2020 5:58 AM GMT
కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ సొంతం చేసుకున్న హోల్డర్.. కోహ్లీ, బుమ్రా ఏ ర్యాంకుల్లో ఉన్నారంటే..?

చాలా కాలం గ్యాప్ తర్వాత క్రికెట్ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య సౌతాంఫ్టన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్ లో విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ బాగా రాణించాడు. మొదటి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను తక్కువ పరుగులకే కట్టడి చేశాడు. మొత్తం ఏడు వికెట్లు ఈ టెస్టులో తీశాడు హోల్డర్.

ఐసీసీ ర్యాంకింగ్స్ లో జేసన్ హోల్డర్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. బౌలర్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇది అతడి కెరీర్ లోనే ఉత్తమమైన ర్యాంకింగ్ కావడం విశేషం. ప్రస్తుతం అతడి రేటింగ్ పాయింట్లు 862 ఉన్నాయి. గత 20 సంవత్సరాలలో ఏ విండీస్ బౌలర్ కూడా ఈ స్థాయిలో రేటింగ్ పాయింట్లు సొంతం చేసుకోలేకపోయారు. విండీస్ మాజీ గ్రేట్ కోర్ట్నీ వాల్ష్ 2000 సంవత్సరం ఆగస్టు నెలలో 866 రేటింగ్ పాయింట్లను దక్కించుకున్నాడు. కోవిద్-19 కారణంగా మార్చి నెల నుండి గ్రౌండ్ లోకి దిగని భారత ఆటగాళ్లు తమ స్థానాలలో అలాగే ఉన్నారు.

స్టీవ్ స్మిత్ టెస్టుల్లో నెంబర్ వన్ గా కొనసాగుతూ ఉండగా, భారత జట్టు సారధి విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. పుజారా ఏడో స్థానంలో ఉండగా, రహానే తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. టాప్ 10 లో ఉన్న ఏకైక భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కావడం విశేషం. ఏడో స్థానంలో బుమ్రా కొనసాగుతూ ఉన్నాడు. హోల్డర్ బ్యాట్స్మెన్ ల లిస్టులో 35వ స్థానంలో ఉండగా.. ఆల్ రౌండర్ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నాడు. 485 రేటింగ్ పాయింట్లు హోల్డర్ ఖాతాలో ఉన్నాయి. బెన్ స్టోక్స్ రెండో స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు.

Next Story