'ఐ లవ్ అమరావతి' సెల్ఫీ బోర్డు.. ఎందుకు తొలగించారంటే..!
By అంజి
ఢిల్లీ: దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేసిన 'ఐ లవ్ అమరావతి' బోర్డును సిబ్బంది తొలగించారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఆదేశాల మేరకు ఈ బోర్డును తొలగించినట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు 'ఐ లవ్ అమరావతి' బోర్డును అక్కడున్న ఏపీ సిబ్బంది తొలగించారు. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ బోర్డును తరలించడం రాజకీయంగా వివాదస్పదమయ్య అవకాశాలు కనిపిస్తున్నాయి.
వికేంద్రీకరణ బిల్లు శాసనభలో ఆమోదం పొందింది. రాజధానులను తరలించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా కోతుల బెడద కారణంగానే ఈ బోర్డును తొలగించినట్లు ఓ అధికారి తెలిపారు. కోతుల వల్ల బోర్డు తొలగించాల్సిన అవసరమేంటని ఢిల్లీలో ఉన్న ఏపీ వాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపై అక్కడున్న తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 'ఐ లవ్ అమరావతి' బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలతో 'ఐ లవ్ అమరావతి' , సంక్రాంత్రి సంబరాలు సెల్ఫీ బోర్డులను రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత సంక్రాంతి సంబరాలు సెల్ఫీ బోర్డును తీసేశారు. ఏపీ భవన్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ 'ఐ లవ్ అమరావతి' బోర్డు వద్ద సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించేవారు.