గ్రేటర్ హైదరాబాద్‌లో మాస్క్ లు ధరించని 5,500 మందికి జరిమానా
By సుభాష్ Published on 7 July 2020 6:35 AM GMTదేశంలో కరోనా వైరస్ కాలరాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పట్లో తగ్గేటట్లు లేదన్నట్లుగా కనిపిస్తోంది. ఇక తెలంగాణలో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏమాత్రం తగ్గడం లేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం కరోనా వైరస్ తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకంటే ఒక్క హైదరాబాద్‌లో తీవ్రస్థాయిలో ఉంది. ముందు తక్కువ స్థాయిలో ఉన్న కేసులు ఇటీవల నుంచి ఏకంగా 2వేలకు చేరువలో కేసులు నమోదు అవుతున్నాయి. అది ప్రతి రోజు నమోదయ్యే కేసుల్లో దాదాపు 90శాతం వరకు ఒక్క హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలోనే నమోదు కావడం గమనార్హం.
నిబంధనలు ఉల్లంఘన
ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు కఠినతరం చేశారు పోలీసులు. మాస్క్ లు ధరించని వారిపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారు మాస్క్ లు ధరించని వారిపై కేసులు నమోదు చేస్తూ భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నా.. నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని గ్రేటర్ పరిధిలోని అధికారులు జరిమానాలు విధిస్తున్నారు.
రెండు నెలల్లో 5,500 మందికి జరిమానాలు
కాగా, నగరంలో కోవిడ్ అధికంగా ఉన్నందున మాస్క్ లు తప్పనిసరిగ్గా ధరించాలని పోలీసులు, అధికారులు సూచించినా పెడచెవిన పెడుతున్నారు. దీంతో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలో మే, జూన్ నెలల్లో 5,500 మందిపై కేసులు, జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులన్నీ విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51 (బీ) కింద నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
మాస్క్ లు ధరించని వారికి రూ.1000 జరిమానా
నగరంలో బయటకు వచ్చేవారు తప్పకుండా మాస్క్ లు ధరించాలని సూచిస్తున్నారు. మాస్క్ లు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో ఈ -చలాన్లు జారీ చేస్తున్నారు. ఒక్క రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలో దాదాపు 3వేల కేసులు నమోదు కాగా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2వేల కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మాస్క్ ధరించని వారితో పాటు ఇతర ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిని కూడా గుర్తిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్ ధరించని వారిని గుర్తించి జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు.
భౌతిక దూరం తప్పనిసరి
కాగా, గ్రేటర్‌లో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ తో పాటు భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు. చాలా చోట్ల భౌతిక దూరం పాటించడం లేదని అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని చెబుతున్నారు. మాస్క్, భౌతిక దూరం పాటించకపోతే మున్ముందు మరింత ప్రమాదం పొంచివుండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.