ఓల్డ్ సిటీలో వైఎస్ఆర్ కా బేటీ..!
YS Sharmila Visits Old City. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల తెలంగాణలో తన పార్టీని పటిష్టం చేసుకోవడానికి
By Medi Samrat Published on 19 Aug 2021 1:33 PM GMTవైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల తెలంగాణలో తన పార్టీని పటిష్టం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యలపై ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు షర్మిల. తాజాగా ఆమె ఓల్డ్ సిటీని సందర్శించారు. షర్మిల హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఈరోజు పర్యటించారు. రేపు మొహర్రం సందర్భంగా పాతబస్తీ డబీర్ పూర్ లో ఉన్న బీబీకా ఆలంను ఆమె సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ముస్లిం సోదరులు, సోదరీమణులతో కలిసి చాదర్ సమర్పించడం జరిగిందని.. ఇమామ్ హజరత్ హుస్సేన్ ప్రజల హక్కుల కోసం పోరాడారని... అదే విధంగా తెలంగాణలో హక్కుల కోసం తాము పోరాడతామని ట్విట్టర్ లో చెప్పారు.
మొహర్రం సందర్భంగా డబిర్ పురలోని బీబీకా ఆలంలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. ముస్లిం సోదరులు,సోదరీమణులతో కలిసి చాదర్ సమర్పించడం జరిగింది. ఇమామ్ హజరత్ హుస్సేన్ ప్రజల హక్కుల కోసం పోరాడిన విధంగా తెలంగాణలో హక్కుల కోసం పోరాడుతాం. pic.twitter.com/7DmB4dBXSD
— YS Sharmila (@realyssharmila) August 19, 2021
బుధవారం నాడు షర్మిల ములుగు జిల్లాలో పర్యటించారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం షర్మిల స్థానికులతో భేటీ అయ్యారు. అనంతరం తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామంలో పోడు రైతులను పరామర్శించారు. ఆదివాసీ ఆచార సంప్రాయాలతో షర్మిలకు స్థానిక గిరిజనులు ఘన స్వాగతం పలికారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటన సందర్భంగా పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.