సీఎం కేసీఆర్ స్పందించేంతవరకూ నిరాహార దీక్షకు కూర్చుంటా : నిప్పులు చెరిగిన ష‌ర్మిల‌

YS Sharmila Serious On Saidabad Incident. హ‌త్యాచారం, హ‌త్యకు గురైన‌ సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి తల్లిదండ్రులను వైఎస్సాఆర్‌టీపీ

By Medi Samrat  Published on  15 Sep 2021 8:52 AM GMT
సీఎం కేసీఆర్ స్పందించేంతవరకూ నిరాహార దీక్షకు కూర్చుంటా : నిప్పులు చెరిగిన ష‌ర్మిల‌

హ‌త్యాచారం, హ‌త్యకు గురైన‌ సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి తల్లిదండ్రులను వైఎస్సాఆర్‌టీపీ నాయ‌కురాలు వైఎస్‌ షర్మిళ పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా షర్మిళ మాట్లాడుతూ.. ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ స్పందించేంతవరకూ నిరాహార దీక్షకు కూర్చుంటాన‌న్నారు. బాధిత కుటుంబానికి రూ. పదికోట్ల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే ఇట్లా ఉంటే.. రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేస్తార‌ని మండిప‌డ్డారు. ఇక్కడ నీళ్లు దొరకవు, కానీ మద్యం ఏరులై పారుతుందంట‌.. పోలీసుల వైఫల్యం కాదా ఇది అని ప్ర‌శ్నించారు.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా.. పోలీసులు ఎంతబాగా పనిచేస్తున్నారో తెలియజేయడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. లాఠీ ఛార్జ్ చేసి మరీ చిన్నారి శవాన్ని గుంజుకుపోయారు. పోస్టుమార్టంకి తల్లిదండ్రుల అనుమతి లేకపోయినా శవాన్ని గుంజుకుపోయి పోర్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. పోలీసులు ప్రజల కోసం పనిచేయడంలేదు. కేసీఆర్‌ కు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ప్రజల టాక్స్ లతో జీతాలు తీసుకునే పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించకుండా కేసీఆర్ కోసం పనిచేస్తున్నారు. కేసీఆర్ ఇంట్లో కుక్క హస్కీ చనిపోతే డాక్టర్ ను ఉద్యోగం నుంచి తీసేశారు. చిన్నపిల్లపై అత్యాచారం జరిగే ఎందుకు స్పందించరని అని ప్ర‌శ్నించారు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేని కేటీఆర్ మంత్రి కావడం మన దౌర్భాగ్యమ‌ని ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ హుజురాబాద్ కే ముఖ్యమంత్రి అని.. ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారని ఆరోపించారు.

మహిళలపై లైంగికదాడులు సీఎం కేసీఆర్‌ హయాంలో మూడురెట్లు అధికమయ్యాయని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ మత్తులోనే ఉంటారని.. రాష్ట్రంలో డ్రగ్స్, మద్యం, గంజాయి విచ్చలవిడిగా పెరిగాయని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ‌ను అప్పుల తెలంగాణ, బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ గా మార్చారని మండిప‌డ్డారు. ఘ‌ట‌న‌పై కేసీఆర్‌ స్పందించాలి.. ఎన్‌కౌంటర్ చేస్తారా.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతారా.. మీ ఇష్టం కానీ అమ్మాయిలపై చేయివేస్తే తల తెగిపడుతుందనే భయం కల్పించాలన్నారు.


Next Story