ప్రాణ హాని ఉంది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ సునీత

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత మరోసారి వార్తల్లో నిలిచారు.

By Medi Samrat  Published on  2 Feb 2024 5:23 PM IST
ప్రాణ హాని ఉంది.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ సునీత

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ ఫేస్ బుక్ వేదికగా బెదిరిస్తున్నారని.. చంపేస్తాం అనే విధంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. తనపై బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నప్పటికీ నేను నా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నాను. గత కొన్ని రోజులుగా వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ పేజీలో నా పైన, నా సోదరి షర్మిలపైన అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు. తీవ్ర అభ్యంతరకరమైన, అసహ్యకరమైన రీతిలో పోస్టులు ఉంటున్నాయి. వర్రా రవీంద్రారెడ్డి ఫేస్‌బుక్ పేజీలో మొత్తం షర్మిల, నాపై అనేక అవమానకరమైన పోస్టులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రవీందర్ రెడ్డి ఫేస్‌బుక్‌ పోస్టులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నా తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను. నాకు ప్రాణహాని ఉందని పోలీసులకు, సీబీఐ కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు.

సునీత తమకు ఫిర్యాదు చేశారని సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ఫిర్యాదు చేశారని.. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story