గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరద సాయం కోసం మీ సేవ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. పొద్దున 6 గంటలకే సెంటర్లకు జనం పోటెత్తారు. దరఖాస్తుల నమోదు కోసం తోపులాటలు.. జనం గేట్లు బద్దలు కొట్టుకొని కౌంటర్ల దగ్గరకు పరుగులు తీయడం.. ఇలాంటి ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. చాలా ప్రాంతాల్లో చంటి పిల్లలతో మహిళలు గంటల తరబడి క్యూల్లో ఉండలేక ఇబ్బంది పడ్డారు. ముసలి వాళ్లు ఓపిక లేక సొమ్మసిల్లి పడిపోయారు.ఇలా ఎదురుచూస్తూ.. ఎదురుచూస్తూ ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకి గెలాక్సీ సమీపంలో చోటు చేసుకుంది. మీ సేవ కేంద్రం వద్ద మునవర్ ఉన్నిసా బేగం అనే 56 సంవత్సరాల మహిళ మృతిచెందింది. రూ.10 వేల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళ ఉదయమే మీ సేవ కేంద్రానికి వచ్చి మహిళ సుమారు 6 గంటల సేపు క్యూలైన్‌లో నిలబడింది. ఉన్నట్టుండి ఆమె ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ మహిళ మృతిచెందినట్టు నిర్ధారించారు వైద్యులు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం టీఆర్ఎస్ పార్టీకి మచ్చను తీసుకుని వస్తోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరద సాయం పంపిణీ విషయంలో చాలా చోట్ల జనం తమకు సాయం అందలేదని ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించి ధర్నాలు చేశారు. కార్పొరేటర్లను, ఎమ్మెల్యేల ఇళ్లను చుట్టుముట్టారు. మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌సహా చాలా మందికి ఈ నిరసన సెగలు తగిలాయి. ఈ నిరసనలను ఆపాలని భావించిన ప్రభుత్వం లబ్ధిదారులను మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. చాలా ప్రాంతాల్లో వరద బాధితుల తాకిడి తట్టుకోలేక నిర్వహకులు మీసేవ కేంద్రాలను మూసివేశారు.


సామ్రాట్

Next Story