నానక్ రాంగూడ మహిళ హత్యపై నివేదిక కోరిన గవర్నర్
హైదరాబాద్ నానక్ రామ్ గూడలో మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
By Medi Samrat Published on 29 Aug 2023 7:27 PM ISTహైదరాబాద్ నానక్ రామ్ గూడలో మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ఈ ఘటనపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణం తనను కలిచి వేసిందని ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను 48 గంటల్లోపు తనకు అందజేయాలని సీఎస్, డీజీపీ, సీపీకి ఆదేశించారు. ఈ కేసును రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నిందితులను తక్షణమే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
గత శుక్రవారం నానక్‌రామ్‌గూడలోని ఓ నిర్మాణ కంపెనీలో మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న వెంటనే క్లూస్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిందని ఏసీపీ మాదాపూర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రాథమిక విచారణలో శుక్రవారం ఉదయం బాధితురాలు వ్యర్థ పదార్థాలను సేకరించేందుకు నిర్మాణ సంస్థ వద్దకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం, ఆమె తలకు గాయాలతో సహా పలు గాయాలతో చనిపోయింది. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టంలో తేలింది.
బాధితురాలికి తెలిసిన వాళ్లే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు, ఇతరులను ప్రశ్నిస్తున్నారు. బాధితురాలి భర్త ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడని, ఆమె పిల్లలను చూసుకుంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగస్ట్ 24న మిస్సింగ్ రిపోర్టు ఇచ్చారని పోలీసులు తెలిపారు.