జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి.. డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. మరోపక్క మద్యం కొనుగోళ్లు, విక్రయాలపై అబ్కారీ అధికారులు, పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టారు.
ఒక వ్యక్తికి లేదా సమూహానికి బల్క్ మద్యం విక్రయాలు జరిపితే సంబంధిత మద్యం దుకాణాలపై ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లకు మద్యం ఎరగా వేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు. నిషేధం ఉన్న రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్‌లోకి మద్యం సరఫరా జరగకుండా సరిహద్దుల్లో పోలీసులు, ఆర్టీఏ అధికారులతో కలిసి ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.