నోటిఫికేషన్లు రావడం లేదని.. ఆత్మహత్యాయత్నం చేసిన సునీల్ మృతి
Unemployed suicide for jobs died in nims.జాబ్స్‌కు నోటిఫికేషన్లు రావడం లేదని.. ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదేమోనన్న బెంగతో ఆత్మహత్యాయత్నం
By తోట వంశీ కుమార్ Published on 2 April 2021 12:20 PM ISTప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావడం లేదని.. ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదేమోనన్న బెంగతో వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసిన సునీల్ నాయక్ నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేయకపోవడంతో మనస్థాపం చెందిన బోడ సునీల్ అనే యువకుడు మార్చి 26న హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు అతడిని వెంటనే ఎంజీఎంకు తరలించారు.
అయితే.. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. గత వారం రోజులుగా నిమ్స్‌లోనే చికిత్స పొందుతున్న సునీల్ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్ సింగ్ తండా అతడి స్వగ్రామం. సునీల్ డిగ్రీ వరకు చదివాడు. ఐదేళ్లుగా పోలీస్ ఉద్యోగం కోసం సన్నద్దమవుతున్నాడు. 2016లో పోలీస్ ఉద్యోగ నియామకాల్లో అర్హత సాధించి దారుడ్య పరీక్షల్లో రాణించలేదు. ప్రస్తుతం హన్మకొండ నయీంనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని కేయూలోని గ్రంథాయానికి రోజు వెళ్లి పరీక్షల కోసం సన్నద్దం అవుతున్నాడు.
ఇటీవల ప్రభుత్వం.. ఉద్యోగుల ఉద్యగ విరమణ వయసు పెంచడంతో నిరాశ చెందాడు. ప్రభుత్వం ఇక ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయదని మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. తాను చేతకాక చావడం లేదని.. తన చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలని సెల్పీ వీడియోలో పేర్కొన్నాడు.
తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆందోళన
సునీల్ మృతి చెందడంతో.. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సునీల్ నాయక్ అంతిమయాత్రలో నిరుద్యోగులంతా పాల్గొనాలని యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కల్వకుంట్ల కుటుంబం కళ్ళుతెరిచే వరకు నిరుద్యోగులతో కలసి యూత్ కాంగ్రెస్ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.