ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ అంటే ఏమిటి?

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

By అంజి  Published on  6 Sep 2024 4:38 AM GMT
FTL, Buffer Zone, Hydraa, Hyderabad

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ అంటే ఏమిటి?

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులపై హైడ్రా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ అనే పదాలు తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి. ఇంతకీ బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ అంటే ఇప్పుడు తెలుసుకుందాం..

ఎఫ్‌టీఎల్‌: ఎఫ్‌టీఎల్‌ అంటే ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని అంచనా వేసి ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో చెరువులో పూర్తిగా నీళ్లు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో ఎఫ్‌టీఎల్‌ తెలియజేస్తుంది. అక్కడ అన్ని కాలనీల్లో నీరు ఉండదు. దీంతో చాలా మంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వస్తుంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పట్టా భూములున్నా సరే.. అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు. నిర్మాణాలు చేయడానికి అక్కడ పర్మిషన్‌ ఉండదు.

బఫర్‌ జోన్‌: రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్‌ జోన్‌ అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్‌ జోన్‌ పరిధిని నిర్ణయిస్తారు. బఫర్‌ జోన్ పరిధిలో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. సాగు మాత్రమే చేసుకోవచ్చు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకాలు కూడా ఉంటాయి. కొన్ని బఫర్‌ జోన్లు వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్లకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్‌ జోన్లుగా పరిగణిస్తారు. వాటికి 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.

హైడ్రా: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్ష, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్టవేయడం, ఆక్రమణలను తొలగించడం, అక్రమ నిర్మాణానలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు, ట్రాఫిక్‌ నిర్వహణ, తాగునీరు, విద్యుత్‌ సరఫరా వంటి అంశాల్లో హైడ్రాకు విధులు, బాధ్యతలు ఉన్నాయి.

Next Story