వరదలు లేని నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్
వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 10 Jan 2025 12:55 PM ISTవరదలు లేని నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్
వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్ సిటీలో జరిగిన సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. 'ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ను అనుసంధానించే రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నాం. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుంది. పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కంపెనీలు కలిసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చు' అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగ, ఉపాధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచందని చెప్పారు. హైదరాబాద్ ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీగా నిర్మించాలని నిర్ణయించామన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతుందని తెలిపారు.
''జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషం. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోంది.. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది.. అదే తెలంగాణ రైజింగ్. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీ ని నిర్మించాలని నిర్ణయించుకున్నాం. న్యూయర్క్ , లండన్, టోక్యో, సియోల్ , దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుంది. భారతదేశంలోనే గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం'' అని సీఎం రేవంత్ తెలిపారు.
''3,200 ఈవీ బస్సులను ఆర్టీసీ లోకి తీసుకువస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించాం. మూసీ పునరుజ్జీవనంతో 55 కిలో మీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయనున్నాం. 2050 సంవత్సరానికి అవసరమయ్యే తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణను ఇప్పటి నుంచే ప్రారంభించాం. రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉంది. 360 కి.మీ పొడవు రీజినల్ రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నాం.. దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నాము'' అని సీఎం రేవంత్ తెలిపారు.
''ORR, RRRలను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నాం. ORR, RRR మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, EVలు, సోలార్ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం. ప్రపంచంలో హైదరాబాద్ ను చైనా కు ప్లస్ సిటీ గా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. అవుటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణలో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల వంటి పైన దృష్టి పెడతాము. తెలంగాణ కు తీరప్రాంతం లేదు. అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నాం. ఏపీలోని బందర్ ఓడరేవు తో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారి తో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని ,మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము'' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.