ఇటీవల నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ అగ్ని ప్రమాదం మొదట సెల్లార్‌లో ప్రారంభం అయింది. అక్కడ నుంచి మెల్లగా 4 అంతస్థులకు పాకింది. ఆ సమయంలో వాచ్‌మెన్ పిల్లలు సెల్లార్‌లోనే ఉండిపోయారు. ఆ చిన్నారులను కాపాడాలని అక్కడే ఉన్న ఉస్మాన్ ఖాన్ అనే వ్యక్తి, ఆయన భార్య బేబి, దుకాణంలో పనిచేసే ఇంతియాజ్ లోపలికి వెళ్లారు. కానీ వారిని కాపాడటం కుదరలేదు. క్షణాల్లో పొగ మొత్తం వ్యాపించి బయటకు వచ్చే దారి కనిపించలేదు. దీంతో వారంతా అక్కడే దిక్కుతోచని పరిస్థితిల్లో ఉండిపోయారు.
దీంతో ఇంతియాజ్ అక్కడున్న వారికి ఫోన్ చేశాడు. ‘మమ్మల్ని కాపాడండి.. ఇక్కడ ఊపిరి ఆడటం లేదు.. వెనుక డోర్ తీయండి.. చనిపోయేలా ఉన్నాం’ అంటూ అతడు చేసిన ఆర్తనాదాలు ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆ ఆడియోలో పిల్లల ఏడుపులు కూడా వినపడుతున్నాయి. మాట్లాడుతుండగానే అగ్ని కీలలు వారిని చుట్టుముట్టాయి. ఫోన్ కూడా కాలిపోయింది. చిన్నారులను కాపాడబోయి ఇంతియాజ్, ఆ దంపతులు సజీవ దహనమయ్యారు. పిల్లలను కాపాడేందుకు ఇంతియాజ్ పడిన తపన ఆడియోలో తెలుస్తుంది. నిజంగా ఆ ఆడియో విన్న వారి గుండెలు భారంతో బరువెక్కుతున్నాయి.