ఏది ఏమైనా ఈ సారి 'మేసేవారికి' కాక 'మేయరు' అనే వారికే దక్కాలి
Vijayashanti Fires On TRS And AIMIM. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్
By Medi Samrat Published on 17 Nov 2020 4:35 PM IST
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవానికి దూరమైన ప్రకటనలు చేస్తూ.. ముఖ్యమంత్రి గారు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుతదీపంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయని సీఎం దొరగారు ఆశలు పెంచుకున్నారని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. చాలా ఏళ్ల పాటు గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా.. విద్వేష ప్రసంగాలతో మాయమాటలు చెప్పి పాతబస్తీ ఓటర్లను మోసం చేయడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అందె వేసిన చేయిగా మారిపోయారని.. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ఓటర్లను మాయ చేసి.. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే ఫార్ముల గురించి కెసిఆర్ గారు ఎమ్ఐఎమ్ అధినేతతో మంతనాలు జరిపారన్న ప్రచారం జరుగుతోందని ఆమె విమర్శించారు.
గత ఎన్నికల్లో కెసిఆర్ గారి హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ వోటర్లు ఈసారి మాత్రం టిఆర్ఎస్ అభ్యర్ధులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారని.. ఎంఐఎం తో కలిసి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేయాలనుకున్న సీఎం దొరగారు వేసుకున్న లెక్కలన్నీ ఈసారి తారుమారు కాబోతున్నాయని ఆమె అన్నారు. ఏది ఏమైనా జిహెచ్ఎంసి మేయరు పదవి ఈ పర్యాయం "మేసేవారికి" కాక "మేయరు.." అనే వారికి దక్కాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవమని విజయశాంతి అన్నారు.