అదే ఓట‌ర్ల‌ను పోలింగ్ బూత్‌లకు రాకుండా చేసింది : విజ‌య‌శాంతి

Vijayashanti About GHMC Polling. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఆవేదన కలిగిస్తున్నప్పటికీ..

By Medi Samrat  Published on  2 Dec 2020 3:28 AM GMT
అదే ఓట‌ర్ల‌ను పోలింగ్ బూత్‌లకు రాకుండా చేసింది : విజ‌య‌శాంతి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఆవేదన కలిగిస్తున్నప్పటికీ.. ఇందులో ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత ఎక్కువనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయని మాజీ ఎంపీ విజ‌య‌శాంతి అన్నారు. వరుస సెలవులు ఉన్నాయని తెలిసీ, ఎక్కువ మంది నగరంలో ఉండే అవకాశం లేదని తెలిసీ.. ఈ సమయంలో ఎన్నికలు వచ్చేలా షెడ్యూల్ ప్రకటించారని ఆమె ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా పోలింగ్‌ను నిర్వీర్యం చేసిందనే వాదన బలంగా వినిపిస్తోందని అన్నారు. దీనికి తోడు ఓటరు నమోదు, ఓటరు జాబితాల్లో తగిన మార్పు చేర్పులు, అవకతవకలుంటే పరిశీలించి సరిచేయడానికి కావలసిన సమయం ఇవ్వకుండానే హడావుడిగా కేవలం రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళడం కూడా ఈ పరిస్థితికి దారి తీసిందనే విమర్శను కొట్టిపారేయలేమ‌ని ఆమె అన్నారు.

ముఖ్యంగా చాలా డివిజన్లలో ఉద్దేశ్యపూర్వకంగానే ఎందరో ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయని.. నేటి ఎన్నికల్లో చాలా చోట్ల స్లిప్పులు ఉన్నప్పటికీ ఓటరు లిస్టులో తమ పేర్లు లేవంటూ అనేకమంది ఓటర్లు నిరాశతో వెనుదిరగడం చూస్తే ఈ ఆరోపణలు నిజమని నమ్మక తప్పడం లేదని విమ‌ర్శించారు. ఈ పరిస్థితి ఓటర్లను నిరాశకు గురిచేసి పోలింగ్ బూత్‌లకు రాకుండా చేసిందని. ఇది గాక, చాలా పోలింగ్ బూత్‌‌లలో కోవిడ్ సన్నద్ధత కనిపించలేదనే వార్తలు కూడా వినిపించాయని.. ఇది కూడా ఓటర్లను భయపెట్టిందని ఆమె అన్నారు. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో టీఆరెస్ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించిందని అందరికీ స్పష్టమైందని విజ‌య‌శాంతి అన్నారు.


Next Story