భారతదేశం లోనూ.. తెలంగాణ లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా దేశాలు భారతీయులపై ఆంక్షలు విధించాయి. ఇక వీసాల విషయంలో కూడా పలు దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాదులోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా రెన్యువల్స్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసీ ఇంటర్వ్యూలు సహా అన్ని సాధారణ వీసా సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
మే 3వ తేదీ నుంచి ఈ సేవలను తాత్కాలికంగా ఆపేస్తున్నామని.. తదుపరి ప్రకటన వెలువడేంత వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పింది. ఇక సాధారణ అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ నేటి నుంచే రద్దయ్యాయి. స్థానిక పరిస్థితిలు అనుకూలించేంత వరకు సేవలను రద్దు చేస్తున్నట్టు కాన్సులేట్ జనరల్ చెప్పింది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన అత్యవసర అపాయింట్ మెంట్లను కొనసాగించేందుకు యత్నిస్తామని తెలిపింది. దీంతో వీసాల కోసం ఇంకొద్ది రోజులు ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితులు అంత అనుకూలంగా లేవని యూఎస్ కాన్సులేట్ జనరల్ తెలిపింది.