హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ ఆదివారం ఉదయం ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కొండాపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొండపూర్‌లోని గౌతమి ఎన్‌క్లేవ్‌లోని అపార్టుమెంట్‌లో సెప్టిక్ ట్యాంకును చాలా రోజులుగా క్లీన్ చేయలేదు. దీంతో అపార్టుమెంట్ నిర్వాహకులు సెప్టిక్ ట్యాంకును క్లీన్ చేయడం కోసం ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. స్టెప్టిక్ ట్యాంకును క్లీన్ చేసేందుకు నలుగురు కూలీలు ఆదివారం ఉదయం అక్కడికి వచ్చారు. ఇద్దరు కూలీలు అందులోకి దిగారు. ఈ క్రమంలో వారు ఊపిరి ఆడక మృతి చెందారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను అందులోంచి బయటకు తీశారు. మృతులు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ఘాజీనగర్‌కు చెందినవారని, ప్రస్తుతం వారు సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. తమకు న్యాయం చేయాలని వారు ధర్నాకు దిగారు.