వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింతల మృతి..!
Two woman lost lives due to negligence of doctors.ఇద్దరు బాలింతలు ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం
By తోట వంశీ కుమార్ Published on 13 Jan 2023 7:34 AM GMT
ఇద్దరు బాలింతలు మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరణించినట్లు మృతురాళ్ల బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేష్ తన భార్య సిరివెన్నెలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఇటీవల మహేష్ తన భార్యను కాన్పు కోసం మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చాడు. శస్త్రచికిత్స చేసి వైద్యులు కాన్పు చేశారు. సిరి వెన్నెల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం సిరివెన్నెల అస్వస్థతకు గురి కావడంతో వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందూ సిరివెన్నెల మరణించింది.
మరోవైపు తిరుపతికి చెందిన జగదీశ్ తన భార్య శివానిని మలక్‌పేట ఆస్పత్రికి ఈ నెల 9న తీసుకువచ్చాడు. శివాని పండంటి బాబుకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూ శివాని కూడా ప్రాణాలు కోల్పోయింది.
దీంతో మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వారు చనిపోయారని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అంతకముందు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.