బ‌స్సులు ఆప‌డం లేద‌ని యువ‌తి ట్వీట్‌.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

TSRTC MD Sajjanar Respond for Women Tweet. ఓ యువ‌తి చేసిన ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ స్పందించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sep 2022 7:13 AM GMT
బ‌స్సులు ఆప‌డం లేద‌ని యువ‌తి ట్వీట్‌.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ ఆర్టీసీ) ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన మార్కుని చూపిస్తున్నారు. ఆర్టీసి ఉన్నతి కోసం వినూత్న నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా ప్ర‌యాణీకులకు అందుబాటులో ఉంటూ వారికి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ ప‌రిష్క‌రిస్తున్నారు. తాజాగా ఓ యువ‌తి చేసిన ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ స్పందించారు.

"దయచేసి మీ డ్రైవర్స్ కి చెప్పండి ప్రతి బస్టాప్ లో బస్సులు ఆపమని 9:52 నుండి 10:02 వరకు ప‌టాన్‌చెరు అల్విన్ బ‌స్టాఫ్‌లో ఒక్క బ‌స్సు కూడా ఆప‌లేదు. చేయి చూపించిన కూడ ఆప‌లేదు. ఇలా ఇప్పటికి చాలా సార్లు జరిగింది. ఆర్టీసీ అంటే ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్టు. స్టాప్‌ల‌లో కాకుండా ఇంక్కెక‌డ ఆపుతారు. ద‌య‌చేసి అవ‌స‌ర‌మైన‌వి చేయండి " అంటూ నందిని అనే యువ‌తి ట్వీట్ చేసింది. ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్‌తో పాటు టీఎస్ఆర్టీసీల‌ను ట్యాగ్ చేసింది.

యువ‌తి ట్వీట్ పై స‌జ్జ‌నార్ స్పందించారు. సంబంధిత అధికారులు దీనిని ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాలంటూ టీఎస్ఆర్టీసీ ట్విట‌ర్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై టీఆర్ఎస్ ఆర్టీసీ స్పందించింది. యువ‌తికి క‌లిగిన అసౌక‌ర్యానికి క్ష‌మాప‌ణ‌లు చెబుతూ త‌మ డ్రైవ‌ర్లు, కండ‌క్టర్ల‌కు అల్విన్ బ‌స్‌స్టాప్ వ‌ద్ద బ‌స్సుల‌ను ఆపేలా అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని చెప్పింది. దీనిపై నెటీజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌యాణీకుల ఫిర్యాదుల‌పై వెంట‌నే స‌మాధాన‌మిచ్చే స‌జ్జ‌నార్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Next Story
Share it