రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటి రోజుగా పిలిచే ఎంగిలిపూల బతుకమ్మను గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ మహిళా జర్నలిస్టుల బృందంతో జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు.. పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నరు తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. అనంతరం గవర్నర్ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తమిళిసై గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఇది మూడోసారి.
ఇదిలావుంటే.. అక్టోబరు 3న సద్దుల బతుకమ్మగా ప్రధాన వేడుకలు నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల వార్షిక ఉత్సవాల్లో.. ప్రత్యేకంగా అమర్చిన బతుకమ్మలతో మహిళలు, బాలికలు పాడుతూ నృత్యం చేస్తారు. పండుగ ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మలను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బతుకమ్మను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నారు.