సీఎం కేసీఆర్‌పై అభ్యంత‌ర‌క‌ర‌మైన‌ థంబ్ నెయిల్.. యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోండి..!

TRS Social Media Wing Complaint to CCS Police Against Youtube Channel. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అభ్యంత‌ర‌క‌ర‌మైన‌ థంబ్ నెయిల్ పెట్టిన యూట్యూబ్ ఛానెల్ పై చర్యలు

By Medi Samrat  Published on  26 Sep 2022 9:17 AM GMT
సీఎం కేసీఆర్‌పై అభ్యంత‌ర‌క‌ర‌మైన‌ థంబ్ నెయిల్.. యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోండి..!

ముఖ్యమంత్రి కేసీఆర్ పై అభ్యంత‌ర‌క‌ర‌మైన‌ థంబ్ నెయిల్ పెట్టిన యూట్యూబ్ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నాయకులు సీసీఎస్ సైబర్ క్రైం పోలీసుల‌కు పిర్యాదు చేశారు. అనంత‌రం టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో న్యూస్ క్యూబ్ యూట్యూబ్ ఛానెల్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రసారాలు చేయడం సరికాదని అన్నారు. ఒక వ్యక్తి ఇంటర్వ్యూ ప్రసారం చేస్తూ.. దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణం ఆ భగవంతుడు మాములుగా రాయలేదు.. అనే థంబ్ నెయిల్ పెట్టార‌ని.. అలా పెట్ట‌డం స‌రికాదని మండిపడ్డారు.

థంబ్ నెయిల్ చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానులు ఎంతో కలత చెంది తమ అభిమాన నాయకుడికి ఏమవబోతుందో అని ఆందోళనలో ఉన్నారని అన్నారు. ప్ర‌స్తుత‌మున్న‌ సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా.. కేవలం సెన్సేషన్ కోసం బాధ్యత లేకుండా ఇటువంటి థంబ్ నెయిల్ పెట్టి సమాజంలో అశాంతికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సదరు యూట్యూబ్ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నాయకులు సైబర్ క్రైం పోలీసులను కోరారు. ఇలాంటి చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తమకు మీడియా అన్నా, పత్రికలన్న గౌరవం ఉందన్నారు. మీడియా, యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు తమ బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరించాలని హెచ్చరించారు.


Next Story