సైనిక్ పురి చిల్డ్రన్ పార్క్ ను టెన్నిస్ కోర్ట్ కాంప్లెక్స్‌గా మార్చడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు.?
ఆదివారం ఉదయం చలిని తట్టుకుని మరీ భారీ సంఖ్యలో పర్యావరణ ప్రేమికులు సైనిక్‌పురి GHMC చిల్డ్రన్స్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jan 2024 8:15 PM ISTఆదివారం ఉదయం చలిని తట్టుకుని మరీ భారీ సంఖ్యలో పర్యావరణ ప్రేమికులు సైనిక్‌పురి GHMC చిల్డ్రన్స్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు. ఈ పార్క్ ను టెన్నిస్ కోర్ట్ కాంప్లెక్స్‌గా మార్చడాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. బాలల ఉద్యానవనాన్ని కాస్తా టెన్నిస్ కోర్ట్ కాంప్లెక్స్ గా మారుస్తూ ఉండడంతో పర్యావరణ ప్రాముఖ్యతను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో పిల్లలు, పెద్దలు తమ నిరసనను వ్యక్తం చేయడానికి పెద్ద ఎత్తున పార్క్ వద్ద గుమిగూడారు. 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న చెట్లను నరికివేయకుండా ఆపాలని GHMCని ప్రజలు కోరారు. ఈ చెట్ల కింద పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు విశ్రాంతి తీసుకుంటారు. 50 శాతానికి పైగా చెట్ల కొమ్మలను నరికివేయడం వల్ల ఈ చెట్లు కాస్తా అస్థిరంగా మారాయి.
పచ్చదనాన్ని కాపాడడం :
సైనిక్‌పురి సికింద్రాబాద్‌లో పచ్చదనం కలిగి ఉన్న ప్రాంతాలలో ఒకటి. భారీగా ఆక్సిజన్ ను అందించే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ప్రైవేటీకరణ కోసం పచ్చదనం లేకుండా చేయడం దారుణమని.. ఇలాంటి ప్రదేశాలను రక్షించుకోవడం చాలా ముఖ్యం అని నివాసితులు కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో వెల్ఫేర్ సంఘానికి చెందిన ప్రముఖులు సూసీ తరు, మనోగ్యరెడ్డి, జీఎస్ చంద్రశేఖర్, పంకజ్ సేఠితోపాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. పార్క్ ధ్వంసానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్న వాళ్లు కేవలం సైనిక్‌పురికి చెందిన వాళ్లు మాత్రమే కాదు.. సైనిక్‌పురి రీడ్స్‌లో భాగమైన మేధా ఖోలీ, మణికొండ నుండి సైనిక్‌పురికి మారిన విశ్వ వంటి నగరంలోని అనేక మంది పర్యావరణ ప్రేమికులు ఉద్యానవనం వద్ద సమావేశమయ్యారు. నగరాన్ని కాపాడుకోవడానికి అవసరమైన సాధారణ హరిత ప్రదేశాలను రక్షించడం గురించి చర్చించారు.
‘ట్రీ హగ్గర్’ అని రాసి ఉన్న ప్లకార్డులతో వచ్చిన పిల్లలు, చెట్లను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ.. చిప్కో ఉద్యమాన్ని అనుకరిస్తూ, తమకు తెలిసిన చెట్లపై ఉన్న ప్రేమకు నిరసనగా చెట్లను కౌగిలించుకున్నారు. “ఈ చెట్లపై30 రకాల పక్షులు ఉన్నాయి. ఇంతకుముందు పూర్తిగా చెట్లతో కప్పబడినప్పుడు ఎండకూడా పడేది కాదు.. కానీ ఇప్పటికే కొమ్మలు కొట్టేయడంతో తేడాను మీరు చూడవచ్చు, ”అని సూసీ తరు చెప్పారు.
కొమ్మలను కత్తిరించడం:
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (AFCOHS) పార్క్‌లో చెట్ల కొమ్మలను కనికరం లేకుండా నరికివేశారు. భారీ చెట్లు ఉన్న ప్రాంతాలను.. ఇప్పుడు ఇసుక, కాంక్రీటుతో నింపుతున్నారు. ఈ స్థలంలో టెన్నిస్ కోర్ట్ ను సిద్ధం చేయాలని భావిస్తూ ఉన్నారు. ఈ ఉద్యానవనం పిల్లల కోసం ఆట స్థలాన్ని కలిగి ఉంది. స్థానికులు ఈ పార్కులో తమ పిల్లలతో ఆడుతూ సమయాన్ని గడిపేవారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా చెట్టను ఎక్కేందుకు తీసుకొచ్చేవారు. ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడేందుకు కూడా అందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చేవారు.
చెట్లను నరికివేయడానికి అనుమతి లేదు: GHMC
చెట్లను నరికివేయడానికి అనుమతి లేదని జీహెచ్‌ఎంసీ, అటవీ శాఖ స్పష్టం చేశాయి. పార్కును AFCOHS నిర్వహిస్తోంది. సొసైటీ వారు కొమ్మలను కత్తిరించడానికి కూడా అనుమతించలేదని తెలుస్తోంది. AFCOHS నివాసి మనోగ్య రెడ్డి మాట్లాడుతూ, “సెప్టెంబర్ 2023లో ఈ ప్రతిపాదనను డిపార్ట్‌మెంట్ ముందుకు తీసుకుని వచ్చింది. రెసిడెంట్స్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను తిరస్కరించారు, అయితే రెసిడెన్షియల్ కమిటీ కేవలం కొమ్మలను కత్తిరించడానికి అంగీకరించిందని ప్రభుత్వ శాఖలకు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం తర్వాత మేము AFCOHS కు సంబంధించి మరో సమావేశాన్ని నిర్వహించబోతున్నాము.
కమిటీలో విభేదాలు వచ్చాయి
కమిటీలోని ఇద్దరు ముగ్గురు సభ్యులు పార్కును టెన్నిస్ కోర్టుగా అభివృద్ధి చేయాలని కోరుతుండగా, మిగిలిన వారు అడ్డుకుంటూ ఉన్నారు. ఇది GHMC పార్క్ కావడంతో.. ఇది AFCOHS చెందిన వాళ్లు మాత్రమే కాకుండా సైనిక్‌పురి, కాప్రాలోని ఇతర కాలనీల నివాసితులకు కూడా ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. టెన్నిస్ కోర్ట్‌తో, ఈ స్థలాన్ని టెన్నిస్ ఆడే వారు మాత్రమే ఉపయోగించుకుంటారు. ఇతరులను అనుమతించరు. ఇవి సాధారణ ఆట స్థలాలు.. వాటిని ప్రైవేటీకరించబడకుండా ఉండాలి. GHMC పబ్లిక్ పార్క్‌ను ప్రైవేట్ టెన్నిస్ కోర్ట్‌గా మార్చడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని నివాసితులు తెలిపారు.
సైనిక్‌పురి, ప్రక్కనే ఉన్న కాప్రా కాలనీలలోని ప్రజలు కూడా ఈ నిరసనలలో పాల్గొంటూ ఉన్నారు. ఇతర కాలనీ వాసులు పార్క్‌ను వాకింగ్‌కు వినియోగించుకోవాలని, పిల్లలు ఆడుకునేందుకు మరింత అనువైన ప్రాంతంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ పార్క్ లో మరింత పచ్చదనం తీసుకుని వచ్చేందుకు మొక్కలు కూడా విరాళంగా ఇవ్వాలని ప్రణాళిక వేస్తున్నారు.