హైదరాబాద్‌లో విషాదం.. తల్లి ఆత్మహత్య తట్టుకోలేక కొడుకు సూసైడ్‌

చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంట తడి పెట్టించింది.

By అంజి  Published on  25 July 2024 9:30 AM IST
Hyderabad, suicide, Crime

హైదరాబాద్‌లో విషాదం.. తల్లి ఆత్మహత్య తట్టుకోలేక కొడుకు సూసైడ్‌

హైదరాబాద్‌: చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంట తడి పెట్టించింది. ఒంగోలుకు చెందిన గుంజి శివ.. తన భార్య పద్మ, తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చి కొత్తపేటలోని ఎస్‌ఎల్‌ఆర్‌ కాలనీలో అద్దెకు ఉంటూ జీవనం కొనసాగించాడు. గుంజు శివ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. దీంతో ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి.

ఈ క్రమంలోనే తల్లి పద్మ కుటుంబ పోషణ, పిల్లల చదువుల ఖర్చులు భరించలేక నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన పెద్ద కొడుకు వంశీ (18) ఫ్యాన్‌కు వేలాడుతున్న కన్నతల్లిని చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదంతా క్షణాలలో జరిగిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతురాలి రెండో కుమారుడు తన తల్లి మరణ వార్తను స్థానిక బందువులకు, స్థానికులకు తెలియజేయడానికి వెళ్లి వచ్చేసరికి తన సోదరుడు కూడా ఆత్మహత్యకు ఒడిగట్టడంతో తమ్ముడి బోరున విలపించాడు. తల్లి, తోడ బుట్టిన అన్న ఇలా అర్ధంతరంగా తనను ఒంటరిని చేసి వెళ్లి పోయారంటూ బోరున విలపించాడు. అతని రోదన పలువురి హృదయాలను కదిలించి వేసింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని, మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.

Next Story