హైదరాబాద్: నగరంలో వీధి కుక్కలు రోజురోజుకీ వీరంగం సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిపై ఒక్కసారిగా దాడికి పాల్పడుతున్నాయి. ఇటువంటి సంఘటనే తాజాగా మియాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ లో భిక్షాటన చేస్తున్న కుటుంబానికి చెందిన బాలుడు సాత్విక్ (6) నిన్న రాత్రి సమయంలో ఆడుకుంటూ.. ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు అతని కోసం చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా కూడా బాలుడి గురించి ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈరోజు ఉదయం మియాపూర్ లోని మక్త మహబూబ్‌పేట్ గవర్నమెంట్ స్కూలు వెనకాల ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం కనిపించింది.
ఇది చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాలుడి ఒంటిపై కుక్కలు దాడి చేసిన ఘాట్లను పోలీసులు గుర్తించారు. డంపింగ్ యార్డ్ కావడంతో అక్కడ అధికంగా కుక్కలు ఉన్నట్లుగా స్థానికులు తెలిపారు. అయితే నిన్న రాత్రి సమయంలో ఆడుకుంటున్న సాత్విక్ పై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడికి పాల్పడి అతి దారుణంగా కొరికి చంపేశాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో బాలుడు మృత్యువాత పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.