న్యూ ఇయర్... హైదరాబాద్‌లో అర్ధరాత్రి ట్రాఫిక్ ఆంక్షలు
Traffic restrictions on New Year’s Eve. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ఆంక్షలు విధించనున్నారు పోలీసులు
By Medi Samrat Published on 31 Dec 2020 4:08 PM ISTనూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్‌లో ఆంక్షలు ఉండనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో భాగంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. ప్రత్యామ్నాయం లేని బేగంపేట ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్నింటిని గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మూసేస్తారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. 1వ తేదీ తెల్లవారుజాము 2 గంటల వరకు బస్సులు, లారీలు ఇతర భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు.
-పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఎయిర్‌పోర్టు వెళ్లే వారికి మినహా మిగతా వాళ్లకు అనుమతి లేదు.
- వీవీ స్టాట్యూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజ్‌భవన్ మీదుగా పంపిస్తారు.
- లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్‌కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య మీదుగా మళ్లిస్తారు.
- బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మీనార్, లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్ వైపు మళ్లిస్తారు.
-ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు.
-సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు.