హైద‌రాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు

Today Traffic Restrictions in Hyderabad.హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో నేడు(శుక్ర‌వారం) ట్రాఫిక్ పోలీసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2022 5:38 AM GMT
హైద‌రాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో నేడు(శుక్ర‌వారం) ట్రాఫిక్ పోలీసులుఆంక్ష‌లు విధించారు. రంజాన్ మాసంలో ఉప‌వాస దీక్షలకు చివరి శుక్రవారం కావడంతో పాత‌బ‌స్తీలోని మ‌క్కా మ‌సీదులో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోద‌రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వ‌నున్న నేప‌థ్యంలో ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లోకి రానున్నాయి.

ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్‌ విందుకు సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముస్లిం మత పెద్దలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండ‌నున్నాయి. చాపెల్ రోడ్డు మీదుగా జగ్జీవన్ రామ్ విగ్రహం జంక్షన్ వైపు వచ్చే వాహనాలను పోలీస్ కంట్రోల్ రూం మీదుగా దారి మ‌ళ్లించ‌నున్నారు.

- గన్ ఫౌండ్రీలోని ఎస్‌బీఐ మీదుగా బషీర్​బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు మీదుగా వెళ్లాల్సిఉంటుంది.

- రవీంద్ర భారతి నుంచి జగ్జీవన్​రామ్ విగ్రహం కూడలి వైపు వచ్చే వాహనాలను సుజాత ఉన్నత పాఠశాల, పతే మైదాన్ మీదుగా దారి మ‌ళ్లించ‌నున్నారు.

- బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.

- నారాయణగూడ నుంచి బషీర్​బాగ్ వైపు వచ్చే వాహనాలు హిమాయత్​నగర్ జంక్షన్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

- కింగ్ కోఠి నుంచి బొగ్గులకుంట మీదుగా బషీర్​బాగ్ వైపు వచ్చే వాహనాలను పబ్లిక్ గార్డెన్ వైపు నుంచి వెళ్లేలా దారి మ‌ళ్లిస్తారు.

చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీద్, సికింద్రాబాద్‌లోని జమే ఈ మసీద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో చార్మినార్ నుంచి మదీనా, చార్మినార్, ముర్గీచౌక్, రాజేశ్ మెడికల్ హాల్, శాలిబండ రోడ్లను మధ్యాహ్నం 3గంటల వరకు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Next Story