'15 సెకన్లు కాదు గంట సమయం తీసుకో'.. నవనీత్ రాణాకు ఓవైసీ కౌంటర్‌

హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాదవీలతకు మద్దతుగా ప్రచారం చేసిన.. నవనీత్ రాణా.. 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

By అంజి  Published on  9 May 2024 9:12 AM GMT
Navneet Rana, Asaduddin Owaisi, Akbaruddin Owaisi, Hyderabad, BJP, MIM

'15 సెకన్లు కాదు గంట సమయం తీసుకో'.. నవనీత్ రాణాకు ఓవైసీ కౌంటర్‌

హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాదవీలతకు మద్దతుగా ప్రచారం చేసిన.. బీజేపీ అమరావతి లోక్‌సభ అభ్యర్థి నవనీత్ రాణా.. 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ''15 నిముషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.. కానీ వాళ్లకు 15 నిముషాలేమో.. మాకు 15 సెకన్లు చాలు'' అని నవనీత్ కౌర్ సవాల్ చేశారు. 2019లో అమరావతి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రానా హైదరాబాద్‌లోని బీజేపీ అభ్యర్థి మాధవి లత తరఫున ప్రచారం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

దీనికి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. ''15 సెకన్లు ఎందుకు గంట సమయం తీసుకో. ముస్లీంలను ఏం చేస్తారో చేయండి..అధికారం మీ దగ్గరే ఉంది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తం.. మేం భయపడం. చేసి చూపించండి'' అంటూ అసదుద్దీన్‌ సవాల్ విసిరారు. 2012లో అక్బరుద్దీన్ ఒవైసీ 15 నిమిషాల పాటు పోలీసులను తొలగిస్తే, “మేము (ముస్లింలు) 100 కోట్ల మంది హిందువులను అంతం చేస్తాం” అని అనడం కలకలం రేపింది.

"అక్బరుద్దీన్‌.. 15 నిమిషాలు పోలీసులను తొలగించండి, అప్పుడు మేం ఏమి చేయగలమో వారికి చూపిస్తామని అన్నారు. నేను వారికి చెప్పాలనుకుంటున్నాను: మీకు 15 నిమిషాలు పట్టవచ్చు, కానీ మాకు 15 సెకన్లు మాత్రమే పడుతుంది. పోలీసులను 15 సెకన్ల పాటు తొలగిస్తే, సోదరులిద్దరూ ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్లారో తెలియదు " అని నవనీత్‌ రానా అన్నారు.

హైదరాబాద్ నుంచి నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ పోటీ చేసింది. ఒవైసీ 2004 నుంచి హైదరాబాద్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నవనీత్‌ రానా వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. '15 సెకన్లు ఇవ్వమని ప్రధాని మోదీకి చెబుతున్నా.. 15 సెకన్లు కాదు.. ఒక్క గంట సమయం కేటాయించండి.. మేం భయపడం.. మీలో ఎంత మానవత్వం మిగిలి ఉందో చూడాలనుకుంటున్నాం' అన్నారు.

నవనీత్ రాణా ప్రకటన అమరావతి ఎన్నికల్లో ఓడిపోతుందనే విషయాన్ని సూచిస్తోందని ఏఐఎంఐఎం నేత వారిస్ పఠాన్ అన్నారు. పఠాన్ ఎన్నికల సంఘం, పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ''అమరావతి ఎన్నికల్లో ఓడిపోతానన్న విషయం నవనీత్ రానాకు అర్థమైంది.. షాక్ తగిలింది అందుకే ఇదంతా చెబుతున్నారు.. పోలీసులు కానీ, ఎన్నికల సంఘం కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. కఠినంగా ఉండాలి. వారు (బిజెపి) పోలరైజేషన్, మత సామరస్యానికి ప్రయత్నిస్తున్నారు'' అని పఠాన్‌ అన్నారు.

బీజేపీ సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. ‘ఇంత మంది సమాజంపై విషం కక్కుతున్నారు.. ఎన్నికల్లో బీజేపీ నేతలంతా ఇలాగే చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

Next Story