విశ్వవిద్యాలయాలు విద్యార్థులను ఆకర్షించే ప్రత్యేక కేంద్రాలుగా ఎదగాలి
Three days conference of Vice Chancellors of Agricultural Universities of India. హైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో జరిగిన మూడు రోజుల భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల సదస్సు
By Medi Samrat Published on 2 Oct 2022 6:47 PM ISTహైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో జరిగిన మూడు రోజుల భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల సదస్సు నేటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్. సి. అగ్రవాల్ మాట్లాడుతూ.. కాల గమనంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థుల నైపుణ్య అభివృద్ధే ధ్యేయంగా నూతన సిలబస్ ను విశ్వవిద్యాలయాల్లో బోధించడానికి ఇప్పటికే సిద్ధం చేశామని వెల్లడించారు. వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల విశ్వవిద్యాలయాలు ప్రతిభ కలిగిన విద్యార్థులను ఆకర్షించే ప్రత్యేక కేంద్రాలుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
సమావేశంలో ప్రధానంగా పలు ప్రతిపాదనలపై చర్చించారు. యోగ, మెడిటేషన్ లో మూడు వారాల నిడివి కలిగిన ఫౌండేషన్ కోర్సును ప్రతిపాదించినట్టు తెలిపారు. దీంతో పాటు విద్యార్థికి డిగ్రీ స్థాయిలో మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అవకాశాన్ని కూడా కల్పించినట్టు చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై నూతనంగా బీఎస్సీ హానర్స్ డిగ్రీ ప్రతిపాదించామన్నారు. భారతదేశం దశాబ్దాలుగా ఆచరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటల ఉత్పత్తి, పరిశోధనలకు గాను ప్రత్యేకించి డిగ్రీ స్థాయిలో సహజ వ్యవసాయంపై బీఎస్సీ హానర్స్ డిగ్రీ ప్రోగ్రాం ఏర్పాటుకు ప్రతిపాదలను సిద్ధం చేశారు. ఈ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఫెలోషిప్స్ ఏర్పాటు చేయడంతో పాటు వ్యాపారాత్మక భాగస్వామ్యం కోసం ఇతర సంస్థలతో ఒప్పందాలు సైతం కల్పించనున్నట్టు ప్రకటించారు. అలాగే దేశంలోని 3 కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సహజ వ్యవసాయ కళాశాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
రైతులు, మానవ వనరులకు శిక్షణను ఇచ్చే బాధ్యతను కృషి విజ్ఞాన కేంద్రాలకు ఇచ్చినట్టు తెలిపారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ప్రధాన పంటల్లో సహజ వ్యవసాయ పద్ధతులను పరీక్షించనున్నట్టు తెలిపారు. నీతి ఆయోగ్ సైతం సహజ వ్యవసాయంపై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక ఏర్పాటు చేసిందని, డాక్టర్ అగ్రవాల్ వెల్లడించారు.భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలు స్వయం పోషకాలుగా ఎదగాలని, అందుకు ఇప్పటి నుండే తమ అవసరాల్లో 30శాతం రెవెన్యూ సొంతంగా సమకూర్చు కునేలా ఆదాయ వృద్ధి నమూనాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్, బ్రీడర్ విత్తన ఉత్పత్తి, విడుదల చేసిన వాణిజ్య రకాల విత్తన ఉత్పత్తి, వ్యవసాయ యంత్రాల తయారీ, అమ్మకం, ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కల అమ్మకం, జీవన పురుగు మందులు, జీవన ఎరువులు, వర్మి కంపోస్ట్, సహజ రంగులు, తృణ ధాన్యాల ఉత్పత్తి, పాలు ఆధారిత ఉత్పత్తులు, పుట్టగొడుగులు, ఎండిన వ్యవసాయ ఉత్పత్తులు, సంప్రదాయ పంట రకాల ఆధారంగా ఆదాయ ఆదాయాన్నిచ్చే మోడల్స్ ను విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అదేవిధంగా తమకున్న నైపుణ్యం, మానవ వనరులు, భూమి వంటి వనరులు ఉన్న నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సేవలు, కన్సల్టెన్సీ అందించే సంస్థలు ఎదగాలని చెప్పారు.
సర్టిఫికెట్ కోర్సులు, డిప్లమా కోర్సులు, అగ్రి టూరిజం, ఉత్పత్తుల బ్రాండింగ్, పరిశోధన సహకార కేంద్రాలుగా, వ్యవసాయ ఉత్పత్తుల ధ్రువీకరణ, అక్రిడేషన్ కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు పని చేయవచ్చన్నారు. కార్యక్రమంలో హైదరాబాదులోని కన్హ శాంతివనంలో గల హార్ట్ ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, న్యూఢిల్లీలోని అఖిల భారత వ్యవసాయ పరిశోధన మండలి మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. దీంతో విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు, పరిశోధనలకు లాభం జరగనుంది. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ బి. నీరజ ప్రభాకర్, డాక్టర్ పి. ఎస్. పాండే, డాక్టర్ రాజేంద్రప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.