ఆ కక్షతోనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర

The police disclosed the details of the murder attempt case against MLA Jeevan Reddy. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

By అంజి  Published on  8 Aug 2022 3:26 PM GMT
ఆ కక్షతోనే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర

ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యాయత్నం కేసులో నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు. ప్రసాద్‌ భార్య లావణ్య సర్పంచి పదవి పోవడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న రూ.20 లక్షలు మంజూరు కాకుండా చేశాడని భావించిన ప్రసాద్‌.. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై కక్ష పెంచుకున్నాడని, ఈ క్రమంలోనే ఆయన హత్యకు కుట్ర పన్నాడని డీసీపీ తెలిపారు.

డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సర్పంచ్‌ లావణ్య అక్రమాలకు పాల్పడిందని మక్లూర్‌ ఎంపీవో రిపోర్ట్‌ ఇచ్చారు. దీని ఆధారంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో కలెక్టర్‌ ఆమెను సస్పెండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఎంపీవోపై ప్రసాద్‌ దాడి చేశాడు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత ప్రసాద్‌ ఎమ్మెల్యేను హత్య చేయాలని కుట్ర పన్నాడు. నాంపల్లిలో ఎయిర్‌ పిస్టల్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌లో కత్తిని కొనుగోలు చేశాడు. గత నెల జులై 15న బిహార్‌కు చెందిన మున్నా వద్ద దేశీ తుపాకీ కొనుగోలు చేశాడు, కానీ అందులో బుల్లెట్లు లేకపోవడంతో ఎయిర్‌ పిస్టల్‌లతోనే ఎమ్మెల్యేను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆగస్టు 1న రాత్రి 8.30 గంటలకు బంజరాహిల్స్ వెళ్లిన ప్రసాద్ నేరుగా ఎమ్మెల్యే ఉంటున్న నివాసంలోని 3వ అంతస్తులోకి వెళ్లి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించి ఒక్కసారిగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కేకలు వేయడంతో ప్రసాద్ అక్కడి నుంచి పరారయ్యాడు. బంజారాహిల్స్, టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలించి ప్రసాద్‌ను అరెస్టు చేశారు. కాగా ప్రసాద్‌కు సహకరించిన వారు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు బయటికి వచ్చే ఛాన్స్‌ ఉందని జోయల్ డేవిస్ తెలిపారు.

Next Story