క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో అరెస్ట్ అయ్యాడు. పటాయలో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అక్కడి థాయిలాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు పటాయాలోని ఓ హోటల్‌లో చాలా మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. క్యాసినో కోసం సంపావో అనే రూమ్ ను అద్దెకు తీసుకున్నారని థాయిలాండ్ పోలీసులు తెలిపారు. డిటెక్టివ్‌ల నుండి వచ్చిన సమాచారం మేరకు హోటల్ పై దాడి చేశారు. తమను చూసి పారిపోయేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించారని థాయిలాండ్ పోలీసులు అన్నారు. థాయ్‌లాండ్ పటాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌పై మే1వ తేదీన తెల్లవారుజామున అక్కడి పోలీసులు దాడులు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 80 మందికి పైగా భారతీయులే ఉన్నారు. నిందితుల నుంచి రూ. 20 కోట్ల నగదు, 8 క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్స్, మూడు నోట్‌బుక్‌లను పోలీసులు సీజ్ చేశారు.